కాళేశ్వరం కాంట్రాక్టర్ల ప్రాజెక్టు.. 25వేల కోట్లు గల్లంతు: కోదండరామ్

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో రూ.25 వేల కోట్లు గల్లంతయ్యాయని విమర్శించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్‌పై లక్ష కోట్లు ఖర్చుపెట్టినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు గ్రామస్థుల దగ్గర తక్కువ డబ్బులకే భూములు గుంజుకున్నారని, వారికి న్యాయం జరగకుండానే రాత్రిపూట కొట్టి బుల్డోజర్లతో కూల్చి గ్రామాన్ని ఖాళీ చేయించారని, కానీ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కొట్టుకపోతుందో ఈ గవర్నమెంట్ కూడా అలాగే కొట్టుకుపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసీఆర్ మళ్లీ గెలిస్తే చిప్ప చేతికి వస్తదని, తెలంగాణను సరి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోదండరామ్ అన్నారు. రాక్షస పాలన అంతం చేయడానికి ప్రజలంతా పనుకోవాలన్నారు. హుస్నాబాద్ నుంచి ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్‌ను గెలిపించుకోవాలి అని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలువాలని, ప్రజాస్వామిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలని కాంగ్రెస్‌కు కొన్ని డిమాండ్లతో సంపూర్ణ మద్దతు తెలిపామని వెల్లడించారు.