కొండా సురేఖ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అధిష్టానానికి ఆమె కూడా తన వివరణ ఇచ్చారని, ఆ తర్వాత హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు అనేది అధిష్టానమే చూసుకుంటుంది అన్నారు. రాహుల్ గాంధీ మీద నాకు నమ్మకం ఉంది, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేస్తుంటాం అని చెప్పారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలని తమ ఆకాంక్ష అని, నిజమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగవద్దని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధితో మునుగోడు ముఖచిత్రం మారిపోతుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి జరుగుతున్నాయి అని తెలిపారు. త్రిబుల్ ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు ఎక్కువ నష్టపరిహారం చెల్లించేలా చొరవ తీసుకుంటున్నామని వెల్లడించారు.
