ప్రజా పాలన అంటే పేదల కోసం పని చేయాలి: రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

ప్రజా పాలన అంటే పేదల కోసం పని చేయాలని, పెట్టుబడిదారులు లేదా కాంట్రాక్టర్ల కోసం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

సొంత పార్టీ ప్రభుత్వంపైన నిన్న విమర్శలు గుప్పించిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవ్వాళ కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన అంటే పేదల కోసం పని చేయాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు సీమాంధ్ర నాయకుల కోసం కాదు అని అన్నారు. చౌటుప్పల్ లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేనెక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు,విమర్శించను కూడా అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పానని, నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయం గుర్తు చేశానన్నారు.

తానేమి మా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, అయితే ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామని, అలాంటి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు,సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం నడపవద్దని కోరుకుంటూ మాట్లాడటం జరిగిందన్నారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు,పేదలకు, నిజమైన పార్టీ కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్ తోనే సాధ్యం అని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

హైకమాండ్ దృష్టికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

పార్టీని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ దృష్టికి నివేదించడం జరుగుతుందని పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ వేదికపై ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలని, రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని అన్నారు. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని, ఎవరి హద్దులో వారు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరేమి చెప్పినా..అభ్యర్థుల ప్రకటన హైకమాండ్ చేస్తుందన్నది అందరికి తెలిసిందేనన్నారు. రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి నాకు కూడా తెలుసు అని, అడగడం మన హక్కు ఇవ్వడం లేదా ఇవ్వకపోడం హైకమాండ్ చూసుకుంటుంది అన్నారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Latest News