కోయిల్ సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు
కృష్ణా నది కి వరద వచ్చింది. జిల్లా లోని పలు జాలాశయాలకు నీటిని విడుదల కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు

కృష్ణా నదికి వరద రాక.. పలు జాలాశయాలకు నీటి విడుదల
ఉంద్యాల పంప్ హౌజ్ నుంచి కోయిల్ సాగర్ కు నీటి విడుదల
చిన్న గోప్లాపూర్ పంప్ హౌజ్ నుంచి సంగం బండ, భూత్పూర్ జలాశయాలకు నీటి విడుదల
నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే లు మధుసూదన్ రెడ్డి, శ్రీహరి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కృష్ణా నది కి వరద వచ్చింది. జిల్లా లోని పలు జాలాశయాలకు నీటిని విడుదల కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడు జూన్ రెండో వారం లోనే నది కి వరద రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ నీటిని పలు జలాశయాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం నారాయణ పేట జిల్లా లోని మక్తల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సంగం బండ, భూత్పూర్ జలాశయాలకు చిన్న గోప్లాపూర్ పంప్ హౌజ్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నీటిని విడుదల చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల పంప్ హౌస్ స్టేజ్ – 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టు కు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మ నీటి పారుదల శాఖ అధికారులతో కలసి కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేశారు.అనంతరం ఎమ్మెల్యే లు మాట్లాడుతూ జూరాల నుంచి ఉంద్యాల పంప్ హౌస్ పేజ్ – 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతం లో సకాలంలో వర్షాలు కురవడం తో జూన్ రెండో వారంలోనే నీరు కోయిల్ సాగర్ కు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందుతున్నదన్నారు. గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టుల నీళ్లు విడుదల చేసి పూలు చల్లారే తప్ప, పదేళ్లలో కృష్ణానది నుంచి పాలమూరుకు అదనంగా చుక్క నీరు తీసుకు రాలేదన్నారు.కృష్ణా నది
నీటితో జిల్లా లోని అన్ని జలాశయాలకు నీటిని విడుదల చేసి పంటలకు సాగు నీరు అందిస్తామని ఎమ్మెల్యే లు పేర్కొన్నారు.