- సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు
- క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా
- సీఎం రేవంత్ కు 48 గంటల డెడ్ లైన్
- గ్లోబ్ ఏరినా సంస్థతో సంబంధంలేదు
- మోదీ పేరెత్తాలంటే రేవంత్ రెడ్డికి భయం
- రేవంత్ పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీ
- కాంగ్రెస్ కు ఒకటి, బీజేపీ రెండు మూటలు
- వరంగల్‌లో మీడియా చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
విధాత, ప్రత్యేక ప్రతినిధి: గ్లోబరీనా సంస్థ తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్) కేసు వేసి లీగల్ నోటీసు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గ్లోబరీనా సంస్థపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. సీఎం చేసిన ఆరోపణలను ఆయన రుజువు చేయాలి.. లేదంటే గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పై ఇప్పటికే పరువు నష్టం నోటీసు పంపించామని వివరించారు. వరంగల్ వచ్చిన సందర్భంగా గురువారం కేటీఆర్ కొందరు మీడియాప్రతినిధులతో చిట్చాట్ చేశారు. గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధాలున్నాయని సీఎం చేసిన ఆరోపణలపై తాను విచారణకుసిద్ధమంటూ, అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని, ఈ పరీక్షకు ముఖ్యమంత్రి కూడా రావాలంటూ షరతు విధించారు.
గ్లోబరీనా సంస్థ నిజంగానే నా బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుంది? అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించరంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ఆరెస్టు అంశంలో రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి… కొడంగల్‌లో ధర్నా చేయడం రేవంత్ రెడ్డి రాజకీయ నాటకం మాత్రమేనని అన్నారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ తో, రాత్రి బీజేపీ తో ఉంటాడంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. కాంగ్రెస్ కి ఒక మూట ఇస్తే, బిజెపికి రెండు మూటలు పంపుతున్నాడంటూ మరో ఆరోపణ చేశారు. కాంగ్రెస్ కి ఒక మూట, బిజెపికి రెండు మూటలు ఇదే రేవంత్ రెడ్డి పాలన అంటూ విమర్శించారు. తన పై చేసిన ఆరోపణల పై సీఐడీ విచారణకు సిద్ధం, రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంలో సిట్ తో గానీ , సీఐడీతో విచారణకు సిద్ధమా? అంటూ డిమాండ్ చేశారు. మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు.
