సకల జనులు ఉద్యమాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ పుష్కర కాలంలో ముష్కురుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.మోసపూరిత హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 25 ఏళ్ల వెనక్కి నెట్టిందన్నారు. వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని, సీఎం రేవంత్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరిగా చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ తల్లి కిరీటాన్ని, తెలంగాణ తల్లి వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగతనం చేసుకొని పోతున్నదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మోసం
ఇప్పటికే సగం సమయం అయిపోయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని, 30నెలల్లో తెలంగాణను అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం కుప్ప కూలిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి…మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. అందుకే ఈరోజు మరో ప్రజా పోరాటానికి, తెలంగాణ కోసం సిద్ధం కావాలన్నారు.
ఉద్యమ నాయకుడే తెలంగాణ ఉజ్వల ప్రస్థానానికి సరైన వ్యక్తి అని, కేసీఆర్ చేతికి ఇదే రోజున తెలంగాణ ప్రజలు బాధ్యత అప్పచెప్పారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు,నియామకాల కోసం సాగిన తెలంగాణ పోరాటం ఆశయాలనే పునాదిగా చేసుకుని పదేళ్లు అద్భుత పాలన అందించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తిరిగి డిసెంబర్ 2028లో కేసీఆరే తిరిగి ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణ ప్రజలే చెబుతున్నారన్నారు.
సంక్షోభంలో వ్యవసాయం
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, రైతుబంధు లేదు, ఎరువుల ఇచ్చేటోళ్ళు లేరు, చివరికి పండించిన పంట రెండు నెలలైనా కొనే దిక్కు లేదు. ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్యం చూస్తుంటే బాధ అవుతున్నదని కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారని, కేసీఆర్ ను బద్నామ్ చేయాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పగబట్టింది. కృష్ణా గోదావరి జలాలను గురువు చంద్రబాబుకు సంతర్పణ చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు. నాలుగుసార్లు రైతుబంధు ఎగగొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి అని, యూరియా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పంటలు కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డ అని, 70 లక్షల తెలంగాణ రైతన్నలు రేవంత్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నారన్నారు.
నిరుద్యోగులకు మోసం
అశోక్ నగర్‌లో నిరుద్యోగ విద్యార్థులను, యువకులను కూర్చోబెట్టి మోసం చేసింది రాహుల్ గాంధీ అని, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 4000 కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, సన్నాసి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? అని, తెలంగాణకి రావడానికి మొహం చెల్లడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా రేవంత్ రెడ్డి? అని సవాల్ చేశారు. పోలీసులు లేకుండా నిరుద్యోగ యువతను కలుస్తావా? అని, ఈరోజు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయిందని, అన్ని వర్గాలు ప్రభుత్వంపైన పోరాటం చేస్తున్నాయన్నారు. అన్నదాతలు, నిరుద్యోగ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అందరూ ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.వారంతా ఎకడికక్కడ నిరసనలు తెలుపుతున్నారని, తెలంగాణలో శాంతి లేదు, భద్రత లేదు. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని, గనులతో దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రజలకు రూపాయి ఇస్తలేరు..రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం టింగ్ టింగ్
ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, కొత్తగా ఒక్క కాలువ, ప్రాజెక్టు నిర్మించకుండా, కొత్త పెన్షన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పును చేశాడని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి దక్కడం లేదు కానీ రాహుల్ గాంధీ అకౌంట్లో మాత్రం టింగు టింగుమని నిధులు పడుతున్నాయని అన్నారు. ఈరోజు తెలంగాణ ముక్తకంఠంతో “కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి” అంటున్నదని, మన పోరాటం అధికారం కోసం కాదు, మన పోరాటం తెలంగాణ కోసం అని, కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకోవడం కోసమే మన పోరాటం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
