మాపై రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చూపే కుయత్నాలు చేస్తూ…గోదావరి నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడుతున్న కరువు కాలం తెచ్చిన కరువు కాదు అని..ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు. ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో గోదావరిలో నీళ్లున్నా మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయని, 2022 వరదల ఫోటోలు చూపి కన్నెపల్లి మునిగిందని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.
నీటి నిల్వ చేయకుండానే ఎత్తిపోయవచ్చు…
మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చు అని, రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసి అయినా రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చు అని, మరో 100 రోజులు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుందన్నారు. 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల లిఫ్ట్ చేస్తే, గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసిందని వెల్లడించారు.
మేడిగడ్డ గేట్లు దించితే భద్రాచలం రాముడు మునిగిపోతాడు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, 2022లో గోదావరిలో 15 రోజులు వరసగా దాదాపు 28లక్షల 50,000 క్యూసెక్కుల వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకొని నిలబడిందని, ఇప్పుడు కేవలం లక్ష క్యూసెక్కులు మాత్రమే వస్తుందని, ఇప్పుడు ఎందుకు తట్టుకోదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పైసలు ఎత్తిపోయడం బాగా తెలుసు, నీళ్లు ఎత్తిపోయడం తెలవదని, ఢిల్లీకి సంచులు మోయడం తెలుసు, కానీ ధాన్యం సంచులు నింపడం తెలవదు అని ఎద్దేవా చేశారు. EMI ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి EMI కట్టకపోతే ఢిల్లీలో ఉద్యోగం పోతదని సెటైర్లు వేశారు.
ఎవరికి బుర్ర తక్కువో ప్రజలకు అర్ధమవుతుంది…
గోదావరిలో కళ్ల ముందు లక్ష క్యూసెక్కుల నీళ్లు వరదలాగా కిందకి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నవాడు బుర్రతక్కువ వాడా? లేదా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్రతక్కువ వాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుండే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంటే.. రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడివో కాదో చెప్పాలన్నారు. అలాగే మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతుంటే కళ్లు ఉండి చూడలేని నువ్వు బుర్రతక్కువ వాడివా.. లేదా వాస్తవాలు చూపించే మేము తెలివి లేనివాళ్లమో ప్రజలు చెప్పాలన్నారు. పోలవరం వల్ల మునిగే భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డ వల్ల మునిగిపోతుంది అంటున్న నీకు బుర్రలేదు అని రేవంత్ పై కేటీఆర్ మండిపడ్డారు.పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపిందని, మరి పోలవరం గురించి ఎందుకు మాట్లాడవు రేవంత్ రెడ్డి? నీ గురువుకు కోపం వస్తుందనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుండి నీళ్లు ఇవ్వమంటే పట్టించుకొని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. గురువు చంద్రబాబు కోసం నీళ్లు కిందకి వదులుతున్నావా అని రైతులు అడిగితే దానికి సమాధానం చెప్పే దమ్ము లేని వాడిరి దద్దమ్మ అనాలా, దరిద్రుడు అనాలా, ఏమనాలని నిలదీశారు. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నా బుర్ర కూడా తక్కువేనని విమర్శించారు.
దమ్ముంటే 10మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రా…
రాహుల్ గాంధీ 2014 నుండి 3 సార్లు ఓడిపోయాడని, అయితే దేశంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా అని, బీఆర్ఎస్ ఒక్కసారి ఓడితే ఏమైపోతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 117 కాదు 7 అసెంబ్లీ స్థానాలు కూడా రావు అని, దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకున్న 10మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ఎవరి బలమెంతో తేల్చుకోవడానికి సిద్దమా అని కేటీఆర్ సవాల్ చేశారు. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ పార్టీ ఒక్క ఎన్నికలో మీ దొంగ ఓట్లతో ఓడిపోతే అయిపోయినట్లేనా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే, తెలంగాణ కోసం కోట్లాడిన మాకేంత ఉండాలన్నారు.
కేసీఆర్ తయారు చేసిన సైనికుడు హరీశ్ రావు..
కేసీఆర్ తయారు చేసిన సైనికుడు హరీశ్ రావు అని, పార్టీ ఆవిర్భావం నుంచి.. కేసీఆర్‌కు ఒక రక్షణకవచంలా నిల్చున్న నాయకుడని కేటీఆర్ పేర్కొన్నారు. నాకు క్యారెక్టర్ ముఖ్యం.. ఏ పార్టీలోకి చేరట్లేదని ఆయన ఎన్నోసార్లు చెప్పాడని, రేవంత్ రెడ్డిలాగా నేను నాలుగు పార్టీలు మారేవాడ్ని కానని క్లారిటీ ఇచ్చాడని, మళ్లీ బీజేపీలోకి పోనంటూ ఒట్టేయాలని రేవంత్ అడగడం హస్యాస్పదం అన్నారు. ఈ దేశంలో ఎవరికైనా శీల పరీక్ష పెట్టాల్సి వస్తే.. అది రేవంత్ రెడ్డికే పెట్టాలని, మా హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు అన్నారు. ఢిల్లీకి పోయి బీజేపీ కాళ్ళు పట్టుకునే రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు గురించి మాట్లాడతాడా? అని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు.. రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడని కేటీఆర్ ఆరోపించారు. దేవుళ్ల మీద ఒట్టేసి అబద్దాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని, రాముడి మీద ఒట్టు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, అబద్ధాలు చెప్తే ఆయనకే నష్టం తప్పదని హెచ్చరించారు.
