Kavitha| మేడారం పనుల టెండర్లలో అవకతవకలు: కవిత

మేడారం పనుల టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి కన్వీనర్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వరంగల్ జిల్లాలో జనం బాట కార్యక్రమం కొనసాగిస్తున్న కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.

విధాత : మేడారం పనుల టెండర్ల(Medaram works tenders)లో అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి కన్వీనర్ , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)ఆరోపించారు. వరంగల్ జిల్లాలో జనం బాట కార్యక్రమం కొనసాగిస్తున్న కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో వీటీడీఏ ద్వారా టెండర్లు ఇచ్చారని..కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు ఇస్తున్నారని,

దీనిపై మంత్రి సీతక్క మౌనంగా ఉండటం సరికాదు అని కవిత అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ జాగృతి ఏం చేసింది..ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్న ప్రశ్న ఎదురవుతుందని..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది పనులు ముందుపడలేదన్నారు. ఆనాటి ప్రభుత్వంలో నన్ను నిజమాబాద్ లోక్ సభకు పరిమితం చేసి..నన్ను ఏం మాట్లాడకుండా కట్టడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను మంత్రిగా కూడా కాదని..దీంతో నేను ఆశించిన మేరకు పనిచేయలేదన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాక..నా ఆలోచనల మేరకు తెలంగాణ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నానన్నారు.

బీఆర్ఎస్ నుంచి నన్ను చాలా అవమానకరంగా బయటకు పంపారని, ఉరి వేసే ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారని, కానీ నాకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని కవిత విమర్శించారు. కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను తప్పా..బీఆర్ఎస్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. పంట నష్టం గురించి చెప్పిన రైతులకు నష్టపరిహారం ఇవ్వం అని కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదని, ప్రభుత్వం ఏమైనా వారి అయ్య జాగీరా? అని కవిత మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఇంతవరకు వసతి గృహం లేదంటే జిల్లాలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు సిగ్గుపడాలన్నారు. సామాజిక తెలంగాణ కోసం నేను జాగృతి ద్వారా ప్రయత్నిస్తున్నానన్నారు.