Bhu Bharathi | లోపాల పుట్ట ‘భూ భారతి’ పోర్టల్.. చెలరేగుతున్న మీసేవా కేంద్రాల ఏజెంట్లు
Bhu Bharathi | రాష్ట్రంలో మీ సేవా కేంద్రాల ఏజెంట్లు జనాలను జలగల్లా పీడిస్తూ ముక్కు పిండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ సేవకు ఎంత డబ్బులు తీసుకోవాలనేది నిర్ణీత ఫీజులను నిర్ణయించినా ఎక్కడా అమలు కావడం లేదు.
Bhu Bharathi | హైదరాబాద్ : రాష్ట్రంలో మీ సేవా కేంద్రాల ఏజెంట్లు జనాలను జలగల్లా పీడిస్తూ ముక్కు పిండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ సేవకు ఎంత డబ్బులు తీసుకోవాలనేది నిర్ణీత ఫీజులను నిర్ణయించినా ఎక్కడా అమలు కావడం లేదు. తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ అధికారులు, మీ సేవా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని కొందరు మీ సేవా ఏజెంట్లు అలుసుగా తీసుకున్నారు.
భూ భారతి ఫోర్టల్ (గతంలో ధరణి ఫోర్టల్)లో ఉన్న లోపాలను కనిపెట్టి కోట్ల రూపాయలకు కన్నం పెట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను తమ జేబుల్లో వేసుకున్నారు. జనగామ జిల్లాలో ఒక రైతు తహశీల్దార్‌ను ఆశ్రయించడంతో భారీ కుంభకోణం బయటపడింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్థిరాస్తి రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుడుతున్నామంటూ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం అధికారాలను కత్తిరించి, ఆ అధికారాలను మండల తహశీల్దార్లకు అప్పగించి, వారికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించింది. సబ్ రిజిస్ట్రార్లకు డెవలప్‌మెంట్ లేదా లే అవుట్ ఓపెన్ ఫ్లాట్లు, అపార్ట్‌మెంటు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించి, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను తహశీల్దార్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారాలు అప్పగించింది కాని రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారా, నామమాత్రంగా చెల్లించి చేయించుకుంటున్నారా అనేది తనిఖీ చేసే అధికారం తహశీల్దార్లకు కల్పించలేదు. ఇదే అదనుగా భావించిన మీ సేవా కేంద్రాల ఏజెంట్లు చెలరేగిపోయారు. అందినకాడికి అందినంత దండుకున్నారు.
భూ భారతి పోర్టల్‌లోనూ ఆర్థిక మోసాలు..!
ధరణి పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూ భారతి పోర్టల్‌ను తీసుకువచ్చింది. సాంకేతికంగా, ఆర్థికంగా మోసం చేసేందుకు ఏ అవకాశాలు ఉన్నాయనేది కనీసం అధ్యయనం కూడా చేయకుండా కొత్త పోర్టల్‌ను తీసుకువచ్చారు. భూ భారతి పోర్టల్‌లో కూడా ఆర్థికంగా మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయని మీ సేవా కేంద్రాల ఏజెంట్లు గమనించారు. భూముల క్రయవిక్రయాలపై రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కొనుగోలుదారులు సరైన అవగాహన లేక మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కొంత మంది తెగబడి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను తమ జేబుల్లో వేసుకున్నారు.
ఆ అధికారం తహశీల్దార్లకు లేకపోవడంతోనే..
సాధారణంగా ఒక గ్రామంలో రైతు తన వ్యవసాయ భూమిని మరొకరికి విక్రయించిన సందర్భంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయం వెళ్తారు. కొనుగోలు చేసిన వ్యక్తి సమీపంలోని మీ సేవా కేంద్రం ఏజెంట్ వద్దకు వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి, రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ కోసం కొనుగోలు చేసే వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఏజెంట్ తీసుకుంటారు. భూ భారతి పోర్టల్‌లో లాగిన్ అయిన తరువాత స్లాట్ బుక్ చేసి, కేవలం నామమాత్రంగా ఫీజులు చెల్లిస్తారు. ఉదాహారణకు రూ.55వేలు చెల్లించాల్సి ఉంటే కేవలం రూ.550 చెల్లించి స్లాట్ బుక్ చేసిన రశీదు అందచేస్తాడు. ఈ రశీదును తీసుకుని కొనుగోలుదారుడు, విక్రయదారుడితో కలిసి తహశీల్దార్ కార్యాలయం వెళ్తాడు. స్లాట్ బుక్ అయినట్లు తహశీల్దార్ తన వెబ్ లాగిన్ ద్వారా పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి సంతకం చేసి, ముద్ర వేస్తాడు. అయితే ఎంత చెల్లించాడు, ప్రభుత్వ ఖాతాలో జమ అయిందా లేదా అనేది పరిశీలించే అధికారం తహశీల్దార్లకు లేదు. దీంతో ఏ లావాదేవీకి ఎంత మొత్తం చెల్లిస్తున్నారనేది తనిఖీ చేసుకునే అవకాశం లేకుండా పోవడాన్ని మీ సేవా ఏజెంట్లు అవకాశంగా, ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
రశీదులపై సక్రమంగానే ఉంటున్నా.. 90 శాతం నగదు దారి మళ్లింపు
యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన 1,367 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్) కు పంపించారు. 1,367 రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వానికి రూ.5 కోట్ల 49 లక్షల వరకు రావాల్సి ఉండగా, రూ.57 లక్షలు మాత్రమే ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. ఈ విషయాలు ఎన్ఐసీ, తహశీల్దార్ల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మీ సేవా కేంద్రాలు కేవలం 10 శాతం సొమ్ము మాత్రమే ప్రభుత్వ ఖజానాలో వేసి, మిగతా 90 శాతం తమ జేబుల్లో వేసుకున్నారు. ఉదాహారణకు చౌటుప్పల్‌లో స్లాట్లు బుక్ చేస్తున్న తరుణ్ అనే వ్యక్తి 240 స్లాట్ల బుకింగ్‌కు రూ.1.20 లక్షలు విక్రయదారుల నుంచి వసూలు చేసి, ఆన్‌లైన్‌లో కేవలం రూ. 90 వేలు మాత్రమే జమ చేసినట్లు వెల్లడైంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించినట్లు రశీదులపై సక్రమంగానే ఉంటున్నా, ప్రభుత్వ ఖజానాలో తక్కువగా జమ అవుతున్నది. ఇలా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాల్లో మీ సేవా కేంద్రాల ఏజెంట్లు లూటీ చేసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఈ కమిటీ సభ్యులు ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నది. ఏ కేంద్రం నుంచి ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఎంత మేర నష్టం జరిగింది, సాఫ్ట్‌వేర్ లోపాలను పరిశీలించనున్నది. ఈ కేసులో వరంగల్ సీసీఎస్ పోలీసులు ముగ్గురు మీ సేవా కేంద్రాల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చలానా విధానమే మేలు..!
గతంలో అమలు చేసిన చలానా విధానం బాగుందని, అంతగా మోసాలు జరిగేది కాదని తహశీల్దార్లు వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ బ్యాంకుల వద్దకు వెళ్లి చలానా లేదా డీడీ చెల్లించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకునేవారని, ఒక్క నయాపైస కూడా దారి మళ్లేది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సురక్షితమైన, సులువైన విధానాన్ని అమలు చేయాలని పలువురు అధికారులు కోరుతున్నారు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లు, డాక్యుమెంటు రైటర్ల వద్ద కేవలం స్లాట్ బుక్ చేసుకునే అధికారం ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లించే అధికారం రద్దు చేయాలని అంటున్నారు. విక్రయదారుడి బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వ ఖజానాకు నేరుగా డబ్బులు వెళ్లేలా భూ భారతి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తే మోసాలు తగ్గుతాయంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram