MG NREGA | హైద‌రాబాద్ : ఓ ఉపాధి హామీ కూలీకి వింత అనుభ‌వం ఎదురైంది. మొక్కు చెల్లించుకునేందుకు అత‌ను గుండు గీయించుకోవ‌డంతో.. ఆ కూలీ ముఖాన్ని యాప్ గుర్తించ‌లేదు. దీంతో అత‌ను షాక్‌కు గుర‌య్యాడు. చివ‌ర‌కు ఓ మ‌హిళ జుట్టును అత‌ని త‌ల‌పై ఉంచ‌డంతో.. యాప్ ముఖాన్ని గుర్తించింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని కోమ‌టిప‌ల్లి గ్రామానికి చెందిన మాల్యాల శ్రీనివాస్ దిన‌స‌రి కూలీ. ప్ర‌స్తుతం ఎండాకాలం కావ‌డంతో ఉపాధి హామీ ప‌నుల‌కు వెళ్తున్నాడు. అయితే ఇటీవ‌ల అత‌ను మొక్కు చెల్లించుకునేందుకు కొండ‌గ‌ట్టు టెంపుల్‌కు వెళ్లాడు. మొక్కులో భాగంగా అత‌ను గుండు గీయించుకున్నాడు. ఇక ద‌ర్శ‌న అనంత‌రం సొంతూరికి తిరిగొచ్చి ఉపాధి హామీ ప‌నుల‌కు వెళ్లాడు.

ఇక ఉపాధి హ‌మీ ప‌నుల‌కు వెళ్లిన శ్రీనివాస్‌కు వింత అనుభ‌వం ఎదురైంది. నేష‌న‌ల్ మొబైల్ మానిట‌రింగ్ సిస్ట‌మ్ యాప్‌లో అత‌న్ని హాజ‌రు వేసుకునేందుకు య‌త్నించ‌గా, యాప్ ముఖాన్ని గుర్తించ‌లేదు. దీంతో శ్రీనివాస్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. ఎంత‌సేపు ప్ర‌య‌త్నించినా యాప్ అత‌న్ని ముఖాన్ని గుర్తించ‌లేదు.

చివ‌ర‌కు తోటి మ‌హిళా కూలీ జుట్టు తీసుకొచ్చి అత‌ని త‌ల‌పై పెట్ట‌గా.. శ్రీనివాస్‌ను యాప్ గుర్తించింది. దీంతో అక్క‌డున్న వారంతా షాక్‌కు గుర‌య్యారు. ఇదేమీ వింత అని ఆశ్చ‌ర్య‌పోయారు. ఇలానే జ‌రిగితే కూలీలు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని వారంతా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉన్న‌తాధికారులు జోక్యం చేసుకుని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.