హంగ్‌లు గింగ్‌లు రావు.. హ్యాట్రిక్ కొడుతది బీఆర్ఎస్ పార్టీ : మంత్రి హరీశ్‌రావు

మంచిర్యాల : భారతీయ జనతా పార్టీ నాయకులపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తెలంగాణ కేసీఆర్ అడ్డా.. రాష్ట్రంలో హంగ్‌లు గింగ్‌లు రావు.. హ్యాట్రిక్ కొడుతది బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ బీజేపోళ్లు కూడా బాగా మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. నిన్న నడ్డా అని ఒకాయన వచ్చిండు. ఆ నడ్డాకు తెల్వది.. నడ్డా ఈ తెలంగాణ కేసీఆర్ గడ్డా అని గుర్తు పెట్టుకోవాలి. నీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే బీజేపీని గెలిపించుకోలేకపోయావు. నువ్వొచ్చి ఈ తెలంగాణలో ఏం చేస్తవు నడ్డా? తెలంగాణ గడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. సొంత రాష్ట్రంలో బొక్కబొర్లపడ్డా నడ్డా.. తెలంగాణలో బీజేపీని గెపిపిస్త అని మాట్లాడితే.. నీ నాటకాలు నడవవు అని తెలియజేస్తున్నాను. తెలంగాణలో బీజేపీ డకౌటే. బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది.. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా రాదు గాక రాదు. ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నవ్ కదా.. డిపాజిట్లు దక్కించుకునే ఓ కమిటీ వేసుకో అని సూచించారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు.. కనీసం ఇప్పుడు డిపాజిట్లు అయినా వస్తే పరువైనా దక్కుతది. చేరికల కమిటీ అని ఒకటి వేశారు. అది అట్టర్‌ఫ్లాఫ్ అయిపోయింది. కనీసం డిపాజిట్ల దక్కించుకునే కమిటీ వేసుకొని.. బీజేపీ పరువైనా కాపాడుకోండి అని హరీశ్‌రావు సూచించారు.
ఇంకొకాయన బీఎల్ సంతోష్ వచ్చి.. ఈ రాష్ట్రంలో హంగ్ వస్తదని అంటుండు.. మిస్టర్ సంతోష్ ఈ రాష్ట్రంలో హంగ్ కాదు.. హ్యాట్రిక్ కొడుతది బీఆర్ఎస్ పార్టీ. కచ్చితంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితడు అని మంత్రి తేల్చిచెప్పారు. బీఎల్ సంతోష్ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు.. ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టించేందుకు వచ్చిండు. మంచిదే.. నీలాంటోడు వస్తే అయింత నామారూపాల్లేకుండా పోతది.. మాకేం రంది లేదు. కానీ హంగ్‌లు గింగ్‌లు రావు.. తెలంగాణలో హ్యాట్రిక్‌లే వస్తయి. మీ గుజరాత్‌లో మూడు మూడు నాలుగు నాలుగు సార్లు గెలవొచ్చు.. కానీ మా కేసీఆర్ తెలంగాణ మూడు మూడు నాలుగు నాలుగు సార్లు గెలవొద్దా? మీ గుజరాత్ కంటే మా తెలంగాణ పాలన నూరుపాళ్లు నయం అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.