BJP National President | ఆ ముగ్గురిలో ఒక మహిళా నేతకు ఈసారి బీజేపీ జాతీయ పగ్గాలు!

BJP National President | ఆ ముగ్గురిలో ఒక మహిళా నేతకు ఈసారి బీజేపీ జాతీయ పగ్గాలు!

BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వచ్చింది. బీజేపీ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి ఆ పదవిని మహిళలకే కేటాయిస్తారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు ఆరెస్సెస్‌ నుంచి సైతం ఆమోదం లభించినట్టు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 400 ప్లస్‌ అని గొంతు చించుకున్న బీజేపీకి.. ఆ సంఖ్య కాదు కదా.. ఆఖరికి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత సంఖ్యలో కూడా ఎంపీలు లేకుండా పోయారు. దీంతో పదేళ్ల క్రితమే మూలకు పడేసిన ఎన్డీయే మళ్లీ వేదికపైకి వచ్చింది. అందులోకి కొత్తగా వచ్చిన పాత మిత్రపక్షాలు టీడీపీ, జేడీఎస్‌ ఊతంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి కత్తిమీద సాములాంటివి. పైపెచ్చు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నది. తద్వారా మహిళా ఓటర్ల మనసులు గెలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నది. ఇదొక అంశమైతే.. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడం కూడా బీజేపీకి అతి పెద్ద టాస్క్‌. ఇప్పటి వరకూ ఉత్తరాది రాష్ట్రాలపైనే ప్రధానంగా బీజేపీ ఆధారపడుతూ వస్తున్నది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఇటు దక్షిణాదిపై ప్రభావం చూపేలా, అటు మహిళలను ఆకర్షించేలా దక్షిణాదికి చెందిన ఒక మహిళా నేతకు బీజేపీ జాతీయ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం రెండేండ్ల క్రితమే 2023, జనవరితో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇటీవలే ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్టానం పార్టీకి కొత్త జాతీయ సారధిని ఎన్నుకునేందుకు తుది కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మహిళలకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు బయటకు పొక్కాయి.

నిర్మలా సీతారామన్‌..

పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్‌ ముందంజలో ఉన్నారు. మహిళలకు బాధ్యతలు అప్పగించే విషయంలోనే కాకుండా.. నిర్మలను ఆ పదవికి ఎంపిక చేసేందుకు కూడా ఆరెసెస్స్‌ సుముఖంగా ఉన్నదని తెలుస్తున్నది. ఇటీవలే జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎస్‌ సంతోష్‌ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్‌ పేరునే చర్చించినట్లు సమాచారం. గతంలో కేంద్ర రక్షణ మంత్రిగా, ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ఉన్నారు. పార్టీలో సీనియర్‌ నేత. సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యానికి, త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సైతం కూడా నిర్మల నియామకం కలిసొస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

వనతి శ్రీనివాసన్

తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన ఆమె అంచలంచెలుగా ఎదుగుతూ.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పదోన్నతి పొందారు. 2021 ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, సీనియర్ నటుడు కమల్ హాసన్‌ను ఓడించి కోయంబత్తూర్ (దక్షిణ) స్థానం నుంచి గెలిచారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితురాలై.. తమిళనాడు నుంచి కేంద్ర కమిటీకి ఎంపికైన తొలి మహిళగా నిలిచారు.

పురంధేశ్వరి

రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో వినిపిస్తున్నది. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో పార్టీ పుంజుకుంది. బహుభాషాలలో మాట్లాడగలిగే నేర్పు ఉన్న పురంధేశ్వరీ ఇటీవల ఆపరేషన్ సిందూర్‌పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధుల బృందంలో సభ్యురాలిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి కొన్నేండ్ల క్రితమే బీజేపీలో చేరిన నేపథ్యం ఆమెకు ప్రతిబంధకంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.