Jupally Krishna Rao : పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి జూపల్లి పిలుపు. తెలంగాణ కొత్త టూరిజం పాలసీతో పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు.

Jupally Krishna Rao : పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

విధాత, హైదరాబాద్: పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని.. ప్రభుత్వం నుంచి వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన ట్రావెల్, టూరిజం ఫెయిర్ ను ప్రారంభించి మాట్లాడారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం అని..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటీవల నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిందని పేర్కొన్నారు. పర్యాటకం కేవలం వినోదం కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడుల‌కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. వివిధ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇది విస్తృతమైన అవకాశాలను కల్పిస్తుందని స్పష్టం చేశారు.

ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, తెలంగాణలోనే త్వరలో ఒక ఉన్నత స్థాయి టూరిజం కాంక్లేవ్‌ను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం చ‌ర్చ‌లకు, పెట్టుబడి ప్రణాళికలకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుంది అని తెలిపారు. ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వ‌న‌రులు తెలంగాణలో ఉన్నాయని.. అయితే తెలంగాణ ప‌ర్యాట‌కానికి అనుకున్న స్థాయిలో ప్ర‌చారం ల‌భించ‌క‌పోవ‌డ‌మే అస‌లైన లోటుగా ఉందన్నారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసడర్లుగా నిలవాల‌ని టూరిజం, ట్రావెల్స్, హ‌స్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులను కోరుతున్నానని పేర్కొన్నారు.