Komatireddy Venkat Reddy : రాష్ట్రంలో రూ.232 కోట్లతో నూతన పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం
రాష్ట్రంలో రూ.232 కోట్లతో నూతన పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

విధాత, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా రూ.232కోట్ల వ్యయంతో అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టామని, శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్ స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన శిశు విహార్, ఏఆర్ డీఎస్పీ, ఆర్‌ఐ, ఆర్ఎస్ఐ క్వార్టర్స్‌ను వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖ సిబ్బందికి కొత్త వసతులు కల్పించడం ఆనందంగా ఉందనన్నారు. హైదరాబాద్ హెడ్‌క్వార్టర్ తర్వాత 32 మండలాలతో నల్గొండ పెద్ద జిల్లాగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సెలవులు, పండుగలు లేని ఉద్యోగం పోలీస్ ఉద్యోగమని, వారి సేవలకు సమాజం గౌరవం ఇవ్వాలని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నేరాలు, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక శ్రద్ధతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారని వెంకట్ రెడ్డి తెలిపారు. డగ్స్ తయారీ, రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు డ్రగ్స్ రాకుండా అడ్డుకునే దిశగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.