HILT Policy : హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్

హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్. పారిశ్రామిక భూముల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు. సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయాలని డిమాండ్.

HILT Policy : హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT) పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు కు తెలిపారు. దీనిపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరుతూ పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తమ పిటిషన్ లలో కోరారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని, ఇందులో భారీ అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. పిటీషన్ లను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల 29కి తదుపరి విచారణ వాయిదా వేసింది.

హిల్ట్ పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హిల్ట్ తీవ్ర చర్చలకు దారితీస్తోంది. రూ.5లక్షల కోట్లు విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం 5వేల కోట్లకే అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని..రాష్ట్ర ఖజనాకు గండిపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన అనునయులకు భూములు కట్టబెట్టేందుకు హిల్ట్ పాలసీ తెచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వాలు బాలానగర్, జీడిమెట్ల, సంనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్లలో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను రాయితీ ధరలకు కేటాయించాయి. ఇవి పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం మాత్రమే ఇచ్చినవి. కానీ హిల్ట్ పాలసీ ద కింద, ఈ భూములను వాణిజ్య, నివాస జోన్లుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ (SRO) విలువలో 30% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మార్కెట్ ధరలు SRO కంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం రూ.5,000 కోట్ల మాత్రమే సేకరించగలదనీ, ఇది రాష్ట్ర బడ్జెట్‌కు రెండు రెట్లు సమానమైన నష్టమని కేటీఆర్ లెక్కల్లో చూపించారు. పార్టీ పరంగా నిజనిర్ధారణ కమిటీలు వేసి భూముల వాస్తవ పరిస్థితిపై విచారణ కొనసాగిస్తున్నారు.

అటు బీజేపీ కూడా హిల్ట్ పాలసీతో లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. అయితే హిల్ట్ పాలసీపై వస్తున్న ఆరోపణలని మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఈ పాలసీలో లీజు భూములను కన్వర్షన్‌కు అనుమతే లేదని చెప్పారు. ‘‘పట్టాలు ఉండి, సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజు పెట్టాం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రావేత్తలకు ఇస్తూ జీవో తెచ్చారని విమర్శించారు. ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం హిల్ట్ ద్వారా మేం చేస్తున్నాం. ఈ పాలసీలో ఎస్ఆర్‌ఓ రేటు కన్నా ఎక్కువ ఫీజు పెట్టాం’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Komatireddy : అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు
Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు