రూ.40 కోట్లతో చిట్యాల ఫ్లైఓవర్ పనులకు గుత్తాతో కలిసి భూమి పూజ … మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ప్రమాదాల నివారణకు 325కోట్లతో చేపట్టనున్న పనులు డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

రూ.40 కోట్లతో చిట్యాల ఫ్లైఓవర్ పనులకు గుత్తాతో కలిసి భూమి పూజ … మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైవేపై ప్రమాదాల నివారణకు 17బ్లాక్‌ స్పాట్‌ల గుర్తింపు
325 కోట్లతో పనులు
16000కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి
రూ.40 కోట్లతో చిట్యాల ఫ్లైఓవర్ పనులకు గుత్తాతో కలిసి భూమి పూజ

విధాత : విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ప్రమాదాల నివారణకు 325కోట్లతో చేపట్టనున్న పనులు డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్‌హెచ్ 65 పై చిట్యాల వద్ద 40కోట్లతో నిర్మించనున్న ఫ్లై ఓవర్‌కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్‌ బీర్ల అయియ్య, ఎమ్మెల్యే వేముల వీరేశంలతో కలిసి వెంకట్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు 500 కోట్లతో ఆర్‌ఆండ్‌బీ రహదారులు తెచ్చామని, రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు ఇండ్లతో పాటు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారితో పాటు, ఇతర ఆర్‌ఆండ్‌బీ రోడ్లకు 16000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు సహా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీసి లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అయినప్పటికి ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, ఆగస్టు 15లోగా 2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని తెలిపారు.

వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం
వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని, స్వంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు మంజూరీ చేస్తామని, స్థలం లేనివారికి ప్రభుత్వ స్థలం ఉన్నచోట ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన 26 వేల కోట్ల రుణాలకు బకాయిలు కట్టామని, బ్రాహ్మణ వెల్లంలా ప్రాజెక్టుకు 400 కోట్లతో 80,000 ఎకరాలకు మూడు నెలల్లో నీళ్లు ఇస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఎస్‌ఎల్బీసీ ఇతర ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి 2,200 కోట్లు ప్రభుత్వం మంజూరీ చేసిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని రోడ్లను ఆర్‌ఆండ్‌బీ రోడ్లుగా మారుస్తామని, చిట్యాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, దాతల సహకారంతో చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలుగా మార్చడం జరిగిందన్నారు. నకిరేకల్ టోల్ గేట్‌ వద్ద ఎన్నారైల సహకారంతో ట్రామ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నల్గొండ, నకిరేకల్ 2 రెండు కళ్ళలాంటివన్నారు. ప్రజల కోసం ప్రాణమిస్తానని, తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. అందరికీ అవసరమైన పనులు చేసి పెడతానన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.