తెలంగాణలోనే ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్

దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 57 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తైందన్నారు.

దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే ఎక్కువగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలును మా ప్రభుత్వం చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వంగపల్లి గ్రామ ఐకేపీ సెంటర్‌ను పరిశీలించి, అనంతరం సమీపంలోని రామాజిపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, దేశంలోనే ధాన్యం కొనుగోలులో నెంబర్ వన్ గా రాష్ట్రం ఉందన్నారు. కేంద్రం సహకరించపోయినా…రాష్ట్ర బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ మద్దతు ధర మేరకు కొనుగోలు జరుపుతుందని, ధాన్యం మొత్తం కొనుగోలు జరిగే వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి

రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతిపక్షాల ఉచ్చులో తెలంగాణా రైతాంగం చిక్కొద్దు అని ఉత్తమ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, 10,097 వేల కోట్లు రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని వెల్లడించారు.
చివరి గింజవరకు కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారమే లేదు అని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల విరేశం, బీర్ల అయిలయ్య యాదవ్, కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.

వడ్ల కొనుగోలుపై ఆందోళన వద్దు: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా బావురావుపేట ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ దీపక్‌తో కలిసి మంత్రి వివేక్ సందర్శించారు. జూన్ 15 వరకు ప్రతి గింజ కొంటామని హామీ ఇచ్చారు.సింగరేణి భవనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మండిపడ్డారు. సంఘ విద్రోహక చర్యలను ప్రేరేపించేలా ఎవరు మాట్లాడినా తప్పేనన్నారు.

Latest News