కళ్ళన్నీ తుక్కుగూడ మీదనే.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యల మర్మమిదేనా?

రాష్ట్రంలో రాజకీయ వర్గాల కళ్ళన్నీ తుక్కుగూడ దిక్కే చూస్తున్నాయి. జనజాతర పేరుతో కాంగ్రెస్ పార్టీ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిణకు సిద్ధమైన నేపథ్యంలో తుక్కుగూడకు ప్రత్యేక ప్రాధాన్యత చేకూరింది.

కళ్ళన్నీ తుక్కుగూడ మీదనే.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యల మర్మమిదేనా?

  • కాంగ్రెస్ భారీ పొలిటికల్ స్కెచ్
  • హస్తం గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?
  • 25 మంది ఎమ్మెల్యేల చేరికకు ముహుర్తం
  • విపక్షాల నుంచి ముఖ్యనేతలు చేరిక
  • విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రాజకీయ వర్గాల కళ్ళన్నీ తుక్కుగూడ దిక్కే చూస్తున్నాయి. జనజాతర పేరుతో కాంగ్రెస్ పార్టీ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిణకు సిద్ధమైన నేపథ్యంలో తుక్కుగూడకు ప్రత్యేక ప్రాధాన్యత చేకూరింది. తుక్కుగూడ ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్ళలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు సమరశంఖం పూరించడమే కాకుండా ఈ వేదికగా ఫిరాయింపులకు తెరతీస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే రాష్ట్రంలో జరిగే ఈ రాజకీయ పరిణామాలు ఒక కుదుపునకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

    రాజకీయ పరిణామాలకు వేదిక

    సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ ప్రచారానికి ఊతమిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారింది. మంత్రి మాటలు రాబోయే పరిణామాలకు ఊతమిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యల వెనుక మర్మమిదేననే చర్చ రాజకీయ పరిశీలకుల్లో సాగుతోంది. శనివారం సాయంత్రానికి కాయో,పండో తేలనున్నప్పటికీ మంత్రి స్పందించిన తీరు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ముహుర్తం నిర్ణయించినట్లు భావిస్తున్నారు.

    గాంధీ భవన్ లో శనివారం ఉదయం శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా మాట్లాడిన అంశాలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కి…పొగరుతో రాష్ట్రాన్ని పాలిస్తే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39 మందికి పడిపోయారు. ఇందులో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు’. అంటూ మీ పనైపోయిందనే రీతిలో మాట్లాడారు. ఈ మాటలను పరిశీలిస్తే పక్కా స్కెచ్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పావులు కదుపుతోందని భావిస్తున్నారు.

    ఆత్మర-క్షణలోకి చేరిన కాంగ్రెస్

    తెలంగాణలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, అధికారంలోకి రాని బీజేపీ ప్రధాన నేతలు చేసిన రాజకీయ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఆత్మరక్షలోకి నెట్టేసింది. లోపల భయమున్నప్పటికీ ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసింది. నిన్నటి వరకు రాష్ట్రంలో జరిగిందంతా అరాచకీయమంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ అదే దారిలో పయనించడమే విషాదం. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి 64 దాని మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానంతో 65 స్థానాలొచ్చాయి. మేజిక్ ఫిగర్ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 39 స్థానాలు బీఆర్ఎస్ కు, 8 స్థానాలు బీజేపీకి, 7 స్థానాలు ఎంఐఎంకు ఇచ్చాయి. అధికారాన్ని కాంగ్రెస్ కిచ్చి బలమైన ప్రతిపక్షపాత్ర నిర్వహించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు ప్రజలిచ్చారు.

    బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు

    కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి కొత్త సర్కారు ఇంకా కొలువు తీరి మంత్రివర్గం తమతమ స్థానాల్లో కుదుటపడకముందే బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు ఒక్కొక్కరుగా ఎంత కాలం ఈ ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. త్వరలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారంటూ పదేపదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. దీనికి బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, తాజాగా డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యలు తోడయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పు జరుగుతోందంటూ జోస్యం చెబుతూవచ్చారు.
    వ్యూహం మార్చిన కాంగ్రెస్ కాంగ్రెస్

    నాయకులు ఈ పార్టీల తీరును విమర్శిస్తూ, ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నారని, ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు ఈ రెండు పార్టీల నాయకులు గొంతు మార్చి మీ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం మీలోని విభేదాలే కూల్చుతాయంటూ సన్నాయినొక్కులు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మరొక అడుగేసి నల్లగొండ,ఖమ్మంలో అసమ్మతి బాంబులున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

    టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలు

    తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని తమకు అనుకూలంగా వినియోగించుకుంటూనే ముందు జాగ్రత్తగా ఫిరాయింపులకు తెరతీశారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లెత్తేశామని ఓపెన్‌గా చెప్పిమరీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తో చెట్టపట్టాలేసుకుని తిరుతుగున్నారు. వీరితో పాటు అనేక మంది సీఎంను కలిశారు. మరికొందరు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. తాజా పరిస్థితుల్లో ఫిరాయింపుల చట్టం వర్తించకుండా గతంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానాన్నే కాంగ్రెస్ ఆచరిస్తున్నట్లు చర్చసాగుతోంది.

    మెజార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుక్కుగూడ సభను చేరికల సభగా కూడా అంతర్గతంగా ప్రకటించుకుంటోంది. కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలుంటాయని ఇప్పటికే సంకేతాలు కూడా వచ్చేశాయి. మంత్రి ఉత్తమ్ మాటల ప్రకారం 25 మంది చేరుతారని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలకు గాలం వేస్తూ, టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి టీమ్ సంప్రదింపులు జరుపుతూ వస్తోందని సమాచారం.

    ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ జోరుగా జరుగుతోంది. గులాబీ పార్టీ నుంచే ఎమ్మెల్యేలతోపాటు, 12 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ మెనిఫెస్టో విడుదల చేస్తూ ఎన్నికల ప్రచారశంఖారావాన్ని ప్రారంభించే జనజాతర సభగా నిర్వహిస్తున్న ఈ సభలో చేరికలుంటాయా? సభకాకుండా మరో స్థలాన్ని నిర్ణయించారా? సాయంత్రం తేలనున్నది.

    పాంచ్ న్యాయ్…పచ్చీస్ గ్యారంటీస్

    జనజాతర సభ రాష్ట్ర రాజకీయాల్లో మోస్ట్‌వాంటెడ్‌గా మార్చేశాయి. ముఖ్యంగా పాంచ్‌న్యాయ్, -పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో లాంఛనంగా విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ సభావేదిక మీదుగా జనానికి పరిచయం కాబోతోంది. అందుకే దేశం చూపు ఈ సభ వైపు అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. కనీసం 13 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు బలోపేతం చేసుకుంటోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతలు హాజరయ్యే సభ కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షలాది మందిని సమీకరిస్తున్నారు. ఈ సభావేదిక నుంచి ఇచ్చే సందేశం కోసం రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.