MLC kavitha | ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు: కవిత సంచలన ఆరోపణ

తనపై ఒకరు చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఇందుకు సంబంధించి తనకు నిర్ధిష్టమైన సమాచారం ఉందని ఆమె అన్నారు.

MLC kavitha | ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు: కవిత సంచలన ఆరోపణ

MLC kavitha | తనపై ఒకరు చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఇందుకు సంబంధించి తనకు నిర్ధిష్టమైన సమాచారం ఉందని ఆమె అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో కవిత మీడియాతో మాట్లాడారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా గుర్తు చేశారు. తనపై వ్యాఖ్యలు చేయించేందుకు ఎందుకు దిగజారారని ఆమె ప్రశ్నించారు. తాను బలంగా కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్నానని అన్నారు. తనను ఒంటరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను దేవుడు చూస్తున్నాడని.. తనను ఇబ్బందిపెట్టినట్టే ఆయన కూడా ఇబ్బంది పడుతారన్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తితో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయించడానికి బీఆర్ఎస్ నాయకుడే ఊతమిచ్చినట్టు తన వద్ద ఆధారాలున్నాయని ఆమె ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని బయట పెడతానని చెప్పారు. అందుకే అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు దీనిపై స్పందించలేదన్నారు.

తాను ఎప్పుడు ఏం చేస్తున్నానో బీఆర్ఎస్ పెద్ద నాయకుడు తెలుసుకుంటున్నారని కవిత ఆరోపించారు. అయితే ఇలాంటి కుట్రలు చేస్తున్న ఆ పెద్ద నాయకుడు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారో తనకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే విషయమై ఎంపీ సీఎం రమేశ్‌తో బీఆర్ఎస్ నాయకులు చర్చించారనే విషయమై మీడియా ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ సీఎం రమేశ్ తనకు తెలుసునని.. కానీ, గత ఐదారేళ్లుగా ఆయనతో తాను మాట్లాడలేదని ఆమె చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై 72 గంటలపాటు దీక్షకు ప్రభుత్వం అనుమతివ్వాలని కవిత కోరారు. దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అనుమతి ఇవ్వకపోతే ఇంటి నుంచే దీక్ష చేస్తామని కవిత స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని కవిత ఎద్దేవా చేశారు.