Mohammad Azharuddin : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్ధీన్

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ సభ్యులు పాల్గొన్నారు.

Mohammad Azharuddin : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్ధీన్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ మంత్రిగా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్ధీన్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్ధీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కేబినెట్ మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా మంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్, అజారుద్ధీన్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనను నామినేట్ చేసింది. అయితే గవర్నర్ ఆమోదం పెండింగ్ లో ఉండగానే..ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. నిబంధనల మేరకు అజారుద్ధీన్ 6నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. లేదంటే ఆయన మంత్రి పదవి నుంచి వైదొలగడం అనివార్యం కానుంది.

క్రికెటర్ నుంచి మంత్రిగా మహమ్మద్ అజారుద్ధీన్

మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ నగరంలో అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు 1963 ఫిబ్రవరి 8న జన్మించారు. ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను, నిజాం కళాశాల నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేశారు. అజారుద్దీన్ 1987లో నౌరీన్ ను వివాహం చేసుకున్నాడు. వారికి మహమ్మద్ అసదుద్దీన్, మ హమ్మద్ అయాజుద్దీన్ లు కుమారులు. 1996లో అజార్ భార్య నౌరీన్ కు విడాకులు ఇచ్చి నటి సంగీత బిజిలానీని వివాహం చేసుకున్నారు. సంగీత కూడా 2010లో అజార్ నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అజార్ చిన్న కుమారుడు అయాజుద్దీన్ 2011 సెప్టెంబర్ 11న అవుటర్ రింగ్ రోడ్ లో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో గాయపడి మరణించారు. పెద్ద కుమారుడు అసదుద్దీన్ 2019లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాను వివాహం చేసుకున్నాడు.

అజార్ క్రికెట్ నేపథ్యం

మొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో భారత్ నుంచి అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మణికట్టు బ్యాటర్ గా అంతర్జాతీయ క్రికెట్ లో తన ఆటతో అజార్ ప్రత్యేకంగా నిలిచాడు. 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. 16ఏళ్ల కెరీర్ లో మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. టీమ్ ఇండియా తరఫున 99 టెస్టు మ్యాచ్ లలో 22సెంచరీలు, 21హాఫ్ సెంచరీలు చేశారు. 334 వన్డే మ్యాచ్ లు ఆడి..7సెంచరీలు, 58హాఫ్ సెంచరీలు చేశాడు. 1985వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. 1990-91ఆసియాకప్, 1995అసియాకప్ సాధించిన టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అజార్ సారధ్యంలో 1996 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అజార్ 54 సెంచరీలు, 74 సెంచరీలు సాధించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న అజారుద్దీన్ పై బీసీసీ జీవిత కాలం నిషేధం విధించడంతో..ఆయన క్రికెట్ కెరీర్ ముగిసింది. 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో బీసీసీఐ అజార్ పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. 2013న ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అజార్ రాజకీయ ప్రస్థానం

2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అజారుద్ధీన్ అదే సంవత్సరం యూపీలోని మొరాదాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014 లోక్ సభ ఎన్నిలకల్లో రాజస్థాన్ లోని టోంకు సవాయి మాదోపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌ను నియమితులయ్యారు. 2019లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2023తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాధ్ పై 16,337ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయనను ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే గవర్నర్ ఆమోదం పెండింగ్ లో ఉంది.