నాదర్ గుల్ భూముల్లో బౌన్సర్లను ఉరికించి కొట్టిన రైతులు!

నాదర్ గుల్ భూములలో ఆక్రమణ పర్వం సాగిస్తున్న ప్రైవేటు కంపెనీల బౌన్సర్లను రైతులు ఉరికించి కొట్టిన వీడియో వైరల్ గా మారింది. మా భూముల్లో మీకేం పని అంటూ బాధిత రైతాంగం వారిని పరుగులు పెట్టించి మరీ తరిమేసింది.

విధాత, హైదరాబాద్ : నాదార్ గుల్ భూములలో ఆక్రమణ పర్వం సాగిస్తున్న ప్రైవేటు కంపెనీల బౌన్సర్లను రైతులు ఉరికించి కొట్టిన వీడియో వైరల్ గా మారింది. మా భూముల్లో మీకేం పని అంటూ బాధిత రైతాంగం వారిని పరుగులు పెట్టించి మరీ తరిమేసింది. అక్రమణ దారులు నిర్మించిన గేట్లను బద్దలు కొట్టి లోపలికి చొచ్చుకొని వెళ్ళి వారిని ఆ భూముల నుంచి తరిమికొట్టారు.

70 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న మా భూమిలో వాళ్లెవరో వచ్చి రేకులు పాతి కబ్జాచే యాలని చూస్తున్నారని, రెండేళ్లుగా తమను తమ భూముల్లోకి రానివ్వరా అంటూ ప్రైవేట్ సైన్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవి ప్రభుత్వ భూములు అని ప్రైవేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నాడని ఈ సందర్బంగా రైతులు ఆరోపించారు.

వివాదాల కేంద్రంగా నాదర్ గుల్ భూముల వ్యవహారం

రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ భూముల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాదర్‌గుల్ భూముల చుట్టే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్‌ 119) ఉన్న సుమారు 373 ఎకరాల భూమి ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది. నిజాం కాలం నాటి రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని, 2005లో ఆర్‌డీఓ కూడా దీనిని సర్కారు భూమిగానే నిర్ధారించారని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో ఏపీఐఐసీ కి బదిలీ అయిన ఈ భూమిపై పలు కోర్టు కేసులు నడిచాయి. ఈ భూమిని ఒక దశలో నిషేధిత జాబితాలో చేర్చారు. మరోవైపు, ప్రైవేట్ పక్షాలు తమకు హక్కులు ఉన్నాయని కోర్టులను ఆశ్రయించారు. 2022లో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ భూమి అమ్మకాలు చెల్లవని, ఇది ప్రభుత్వానిదేనని, సెక్షన్‌ 22ఏ కింద ఆ భూముల ను నిషేధిత జాబితాలో చేర్చడం సరైందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. నాదర్‌గుల్ భూముల వివాదం యాజమాన్యం, కోర్టు తీర్పులు, రాజకీయ ఆరోపణలు కలిసిన క్లిష్ట అంశంగా మారింది. ఈ వివాదానికి పూర్తి స్థాయి స్పష్టత రావాలంటే న్యాయస్థానాల తుది తీర్పు కీలకం కానుంది.

మంత్రి పొంగులేటిపై హరీశ్ రావు ఆరోపణలతో తీవ్రమైన వివాదం

సుమారు రూ. 7,000 కోట్ల విలువైన 373ఎకరాల ఈ ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తాజాగా మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలతో వివాదం తీవ్రతరమైంది. దశాబ్దాలుగా అక్కడ సాగు చేసుకుంటున్న 600 మంది పేద రైతులకు అన్యాయం చేస్తూ, పోలీసు బలగాలతో వారిని భూముల నుంచి వెళ్లగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బోర్ బావులు ధ్వంసం చేయడం, ఫెన్సింగ్ వేయడం వంటి చర్యల ద్వారా రైతులను భూముల నుంచి తరిమేస్తున్నారని, దీని వెనుక మంత్రి కుమారుడి హస్తం ఉందంటూ హరీష్ రావు ఆరోపించారు.ప్రభుత్వం, మంత్రి పొంగులేటి కంపెనీలు అన్యాయంగా పేదల భూములను లాక్కుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు

వాటాలు రాలేదనే మాపై నిందలు : పొంగులేటి

. అయితే హరీశ్ రావు ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిప్పికొట్టారు. వారికి వాటాలు రాలేదని ఇప్పుడు ఆ భూములపై మాపై బురదచల్లే రాజకీయ వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ వారి హయాంలోనే జరిగాయన్నారు. దందాలన్నీ వారు చేసి.. నిందలు తమ ప్రభుత్వంపై మోపుతున్నారని మండిపడ్డారు.‘‘నాదర్‌గుల్‌ సర్వే నంబరు 613లో ఉన్న 373 ఎకరాలను యునైటెడ్‌ ల్యాండ్‌ మార్క్స్‌, ఆల్ఫా ఎస్టేట్స్‌, ఒమేగా డెవలపర్స్‌ అనే మూడు సంస్థలకు 2014 సెప్టెంబరు 1న రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ డాక్యుమెంట్లను 2016 సెప్టెంబరు 24న మ్యుటేషన్‌ చేశారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది ఎవరు?’’ అంటూ ధ్వజమెత్తారు. 2022 నుంచి సుప్రీంకోర్టులో కేసు ఉంటే కనీసం వారు కౌంటర్‌ వేయలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కౌంటర్‌ దాఖలు చేశామని చెప్పారు. నాదర్‌గుల్‌ భూములు గతంలో 22ఏ జాబితాలో ఉన్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కూడా 22ఏ జాబితాలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇక ఈ వ్యవహారంలో ఉన్న ప్రైవేట్ సంస్థలు కూడా బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించాయి, తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, కోర్టు తీర్పుల ఆధారంగానే భూములను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నాయి. రాజకీయపరంగా కొనసాగుతున్న ఆరోపణలు అన్ని అవాస్తవంగా కొట్టిపారేశాయి.

 

Latest News