త్వరలో నూతన హెల్త్ పాలసీ … వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ
రాబోయే రోజుల్లో నూతన హెల్త్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలిపారు. గురువారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన నూతన ఎంఆర్ఐ, మెడికల్ ఓపీ, డైట్ కిచెన్‌ను ప్రారంభించారు.

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం
అభివృద్ధి సంక్షేమం అంటే ప్రజలకుమెరుగైన వైద్యం అందించడమే
విధాత, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో నూతన హెల్త్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలిపారు. శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన నూతన ఎంఆర్ఐ, మెడికల్ ఓపీ, డైట్ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించాలనే తపన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. వైద్య చికిత్స అందించే ప్రొసీజర్స్ పెంచామని, చికిత్స అందించే విషయంలో ధరలను కూడా సవరించామని తెలిపారు. క్యాన్సర్, ట్రామా కేర్ గురించి సమీక్ష చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలనేది తమ లక్ష్యమని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి త్వరలో చికిత్స చెయ్యాల్సి ఉందన్నారు. సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్, సిబ్బంది మెరుగైన సేవలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, ప్రభుత్వంతో చర్చించి త్వరలో అందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు హాస్టల్ భవనం కట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త సెక్రటేరియట్ కట్టడం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కాదని, పేద వారికి మెరుగైన వైద్యం అందించాలనే విజన్ ఉండాలన్నారు. ప్రజాపాలన అనేది గుర్తుకు రావాలేగాని.. అహంకారం కాదన్నారు. ఉస్మానియా అంటే హైద్రాబాద్ కి షాన్ అని వ్యాఖ్యానించారు. అలాంటి ఆసుపత్రిని కాపాడుకోవాలన్నారు. టిమ్స్ ఆసుపత్రి మీద ఉన్న సోయి ఆనాడు ఉస్మానియా ఆసుపత్రిపై వాళ్లకు లేదన్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ సౌకర్యాలపై దృష్టి సారించి అన్ని రకాల వైద్య సేవల ధరలను సవరిస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత అన్ని ఇంచార్జి పోస్టులే ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో ఇస్తామని స్పష్టం చేశారు. దొర, దురాంహకారం ఉండవన్నారు. పోచారం కాంగ్రెస్ లో చేరికపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పదిస్తూ.. కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి కి స్వాగతమన్నారు. కాంగ్రెస్ లోకి ఎవ్వరూ వచ్చినా వెల్కమ్ చెప్తామన్నారు.