- సోషల్ మీడియా తప్పుడు వదంతులను నమ్మవద్దు
- భయాందోళనలకు గురికావద్దని ప్రజలకు విజ్ఞప్తి
విధాత. హైదరాబాద్:
తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని, అనవసరంగా ఆందోళనకు గురికావద్దని వినియోగదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందని ప్రకటించింది. అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కొన్ని పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం తప్పుడు వదంతులేనని, దీంతో ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమేనని స్పష్టం చేసింది.
డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ, ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయి. ఇది కేవలం అంతర్గత పరిపాలన పరమైన విషయం మాత్రమే తప్ప, సరఫరాలో లోపం కాదు. పరిస్థితిని చక్కదిద్ది, అందరికీ సమానంగా ఇంధనం అందేలా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీసు శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపింది.
ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ చేసినా లేదా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు అక్రమంగా మళ్లించినా వారిపై కఠిన చర్యలు తప్పవు. వినియోగదారులు ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని కొరింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని మరియు వాటిని ఇతరులకు పంపవద్దని పౌర సరఫరాల విభాగం కోరింది. ఏవైనా సందేహాలు ఉన్నా లేదా అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా, ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1967 ను సంప్రదించగలరు.
