చత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్‌కు నోటీస్‌లు

బీఆరెస్ ప్రభుత్వ హయంలో జరిగిన చత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి ఫ్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలకు సంబంధించి విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం నోటీస్‌లు జారీ చేయడం సంచలనంగా మారింది.

  • Publish Date - June 11, 2024 / 02:43 PM IST

విధాత : బీఆరెస్ ప్రభుత్వ హయంలో జరిగిన చత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి ఫ్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలకు సంబంధించి విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం నోటీస్‌లు జారీ చేయడం సంచలనంగా మారింది. విచారణ పురోగతిని నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా 25మందికి నోటీసులిచ్చామని..వారందరు సమాధానమిచ్చారని, కేసీఆర్ మాత్రం జూలై 30వరకు సమయం అడిగారని మేం జూన్ 15వరకు ఇవ్వాలని కోరామని తెలిపారు. మరో అధికారి కూడా హాజరుకావాల్సివుందన్నారు. వారందరి సమాధానాలు విన్నాక మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను విచారిస్తామన్నారు. జెన్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు, మాజీ ఇంధన కార్యదర్శి సురేశ్ చందాలను విచారించామన్నారు. జెన్‌కో, ఇతర ఏజెన్సీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేదని, ప్రభుత్వ సూచనల మేరకే నిర్ణయాలు చేశామని చెప్పారన్నారు. మంగళవారం ఎస్‌కే జోషి, అర్వింద్‌కుమార్‌లను విచారించామని తెలిపారు. విద్యుత్తు కొరత నివారణకు 2వేల మెగావాట్ల కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవచ్చని జీవో ఇచ్చారని, రెండు నెలల తర్వాతా ఆ జీవోను మార్చి దేశంలో ఎవరి వద్దనైనా కొనుగోలు చేయవచ్చని ఇచ్చారని చెప్పడం జరిగిందన్నారు. ఇది ఇలా ఉండగానే చత్తీస్‌గఢ్‌తో ఎంవోయూ జరిగిందని, సీపీడీఎస్ఎల్‌ ద్వారా చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేశారని, ఆ సమయంలో అర్వింద్‌కుమార్ చత్తీస్ గఢ్ నుంచి కొనుగోలుతో భారం అధికమవుతుందని, ఒపెన్ మార్కెట్ ద్వారా పోవాలని రెగ్యులెటరీ కమిషన్‌కు లేఖ రాసినా దాన్ని పట్టించుకోలేదని చెప్పడం జరిగిందని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పీపీఏ ఒప్పందంలో కేంద్రానికి అధికారంలో ఇవ్వాల్సివుండగా ఇవ్వలేదన్నారు. చత్తీస్‌గఢ్ రెగ్యులేటరీ కమిషన్‌కే అధికారం ఇచ్చారని, ఈ ఒప్పందాల కారణంగా అధిక మొత్తం చెల్లించాల్సిరావడం జరిగిందన్నారు. టెండర్ ప్రాసెస్ ఆలస్యమవుతుందని భావించి ఎంవోయూ, పీపీఎల్ చేసుకునే సరికి పవర్ ఫ్లాంట్ మనుగడలోనే లేదని, మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం వచ్చిందన్నది తేల్చాల్సివుందన్నారు. భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలాజీ కాకుండా సబ్ క్రిటికల్ వాడటం ద్వారా 300కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అప్పటికే తెలంగాణలో కొత్తగూడెంలో సూపర్ క్రిటికల్ పూర్తయినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. యాదాద్రి ప్లాంటులోనూ టెండర్ వేయలేదని, దానిపై విచారణ సాగుతుందన్నారు. అధికారుల నుంచే కాకుండా కోదండరామ్‌, రఘు వంటి వారి అభిప్రాయలు కూడా తీసుకున్నామన్నారు.

Latest News