విధాత,హైదరాబాద్: రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో హాజరు నమోదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం వేటు వేసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కార్యదర్శులు తమ ఫేస్‌కు బదులుగా సీఎం రేవంత్ రెడ్డి ఫేస్‌తో అటెండెన్స్ నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజనను ఆదేశించారు.
దీంతో వారిపై సస్పెండ్ వేటు పడింది. అయితే కార్యదర్శులను పర్యవేక్షించే కొందరు అధికారులు ఎంపీవోలు, డీపీవోలు సైతం తమ విధులపట్ల అలసత్వం వహిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇకపై ఫేక్ అటెండెన్స్‌కు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని త్వరలోనే తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం టీఎస్ టీఎస్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.