BC Reservation : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి పిటిషన్ 50% పరిమితి మించకూడదని సవాల్ చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో శనివారం నాడు వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ తీర్పును పిటిషనర్ ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయడంతో తెలంగాణలో రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దం. ఇదే విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 6న సుప్రీంకోర్టు విచారించనుంది.
ఇదెలా ఉంటే బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఈ నెల 8న హైకోర్టు విచారణ నిర్వహించనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ జారీ చేసిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోను పిటిషనర్ సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ మెరిట్ ఆధారంగా ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని గత విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నెల 8న ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు విచారించనుంది. మరో వైపు స్థానికసంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఈ నెల 9న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. అయితే తెలంగాణ హైకోర్టులో విచారణ కంటే ముందుగానే సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల అంశంపై పిటిషన్ విచారణకు రానుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది.