Revanth Reddy Instructions | స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను త్వరగా ఫైనల్ చేసి, నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.

విధాత: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు (గురువారం) కాంగ్రెస్ నేతలతో పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, నామినేషన్ పక్రియపై పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు . నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇంచార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని సూచించారు.
పూర్తిస్థాయిలో సమయం కేటాయించి నామినేషన్ల ప్రక్రియకు సమయం కేటాయించాలన్నారు. పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్‌కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలని సూచించారు. గాంధీ భవన్‌లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో- ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని నేతలకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని.. అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని సీఎం ఆదేశించారు.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలని సీఎం తెలిపారు. కోర్ట్ తీర్పు తరవాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం ఉంటుందన్నారు. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.. ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల నాయకులతో అత్యవసరంగా మాట్లాడాలి.. అభ్యర్థులను ఫైనల్ చేసి బీఫామ్ ఇవ్వాలి.. నో డ్యూస్ సర్టిఫికెట్‌లు ఇప్పించాలని సూచించారు.