ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అలాంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ లలో ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు స్పష్టం చేశారు. నిషేధిత భూముల అంశంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలలో 750మంది ఈ సమస్యపై ఇప్పటికే దరఖాస్తులు అందించారని వెల్లడించారు. 22ఏ నిషేధిత జాబితాను అప్‌డేట్ చేయడంలో పొరపాటు జరిగిందన్నారు. ప్రైవేట్ ఆస్తుల్ని 22ఏ నిషేధిత జాబితా నుంచి కొన్ని రోజుల్లోనే తొలగిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 18005994788కు సంప్రదించాలన్నారు.
నిషేధిత జాబితాలో ప్రాపర్టీలు ఉన్న వాళ్లు అభద్రతకు లోను కావొద్దు అన్నారు. యూఎల్సీ(ULC)లో క్లియర్ అయిన ప్రాపర్టీలని నిషేధిత జాబితా(22-A)లో చేర్చడం మా తప్పేనని…ఇందుకు ప్రజలు క్షమించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగిన పొరపాట్లను సరి చేస్తున్నాం.. రెండు రోజుల్లో ఈ సమస్యని పరిష్కరించే చర్యలు చేపట్టాం అని తెలిపారు.
22ఏ జాబితాలో భూమి ఉందనే కారణంతోనే దరఖాస్తును తిరస్కరించవద్దని అధికారులకు స్పష్టం చేశామని మంత్రి తెలిపారు. అసలు ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలించాలని చెప్పారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని సూచించారు. 22ఏను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
