హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యల ధోరణికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. సమకాలీన రాజకీయాల్లో ఎంతో సీనియర్, అనుభవజ్ఞులైన మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ..తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావడం జరుగుతుందని లేఖలో పొన్నం లేఖ రాశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ (నాటి హైదరాబాద్ రాష్ట్రం) ను 1948 లో బలవంతంగా విశాలాంధ్రలో విలీనం చేసిన నుంచి, అంటే 1956 నుంచి జరుగుతున్న పరిణామాలు, అభివృద్దిలో వివక్ష, ఇక్కడి ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలు, ముల్కీ-నాన్ ముల్కీ ఆందోళనలు, తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని 2000 తొలి దశకమంతా జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొని, కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం అని లేఖలో పొన్నం గుర్తు చేశారు.
2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కన్వీనర్‌గా నేను తెలంగాణ అంశాన్ని ఎన్నో స్థానిక, జాతీయ వేదికల మీద ప్రస్తావించడం మీకు తెలిసిందే! ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ గారి సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదిక మీద అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఇందులో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్దం. లోకసభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తో గెజిట్ విడుదల చేసింది.ఇలా అన్ని పక్షాల ఆమోదంతో తెలంగాణ,`ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి అని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలుగువారమంతా సహృదయంతో, పరస్పరం మంచి కోరుకుంటే రెండు రాష్ట్రాలు తక్కువ కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ది చెందుతున్నాయి. ఇదే మనందరికీ కావాల్సింది. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. ఇది మీకు తెలియంది కాదు అని గుర్తు చేశారు.
మీ భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ నాయకులొకవైపు, జనసేన అధినేత మరోవైపు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవు. రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉంటున్నాయి. ఇతరులకు లేని అపోహలు కలిగిస్తున్నాయి. మనసు కలత చెందుతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు అని పొన్నం స్పష్టం చేశారు.
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన నాయకులకు చెప్పండి. భారత్ – పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే విధంగా ఉన్నాయి.. ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలింది అంటూ మీ మరో భాగస్వామి పవన్ కల్యాణ్ (జనసేన అధిపతి) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురిచేశాయి. ఇవి తెలుగు వారి మధ్య వైషమ్యాలు పుట్టించేవే! అలా మాట్లాడటం తప్పని మీ మంత్రివర్గ సహచరునికి చెప్పండని కోరారు. ఇవన్నిటికీ మూలం బీజేపీ సీనియర్ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలే అనుకుంటాను.‘రాష్ట్ర విభజన ద్వారా తల్లి-బిడ్డను విడగొట్టార’ని ఒకమారు, ‘బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపార’ని మరొకమారు ఆయన అనుచితంగా మాట్లాడారు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాల’ని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బీజేపి అని బహుషా ప్రధాని మోదీకి తెలియదేమో! మీరు రాజకీయాల్లో ఆయనకన్న సీనియర్ కనుక కూటమి భాగస్వామి గా ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పండని పొన్నం తన లేఖలో చంద్రబాబును కోరారు.
ఇవి కూడా చదవండి :
“మొదటి సంతకంతోనే హైడ్రాను పీకి పడేస్తాం”.. జగిత్యాలలో కేసీఆర్ గర్జన
మేడిగడ్డ పరీక్షల పూర్తికి మే నెలాఖరు డెడ్‌లైన్.. బరాజ్‌ను సందర్శించిన సీఎం రేవంత్..
