TPTF | పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలి
ప్రాథమిక పాఠశాలలకు పి.ఎస్.హెచ్.ఎం. పోస్టులను మంజూరు చేసి డీఈడీతో పాటు బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ కోరారు

ఎస్ జీ టి లకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలి
విధాత, వరంగల్ ప్రతినిధి:అన్ని ప్రాథమిక పాఠశాలలకు పి.ఎస్.హెచ్.ఎం. పోస్టులను మంజూరు చేసి డీఈడీతో పాటు బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ కోరారు. మంగళవారం టి పి టి ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమము లో భాగంగా వరంగల్ మండలము లో మట్టేవాడ ప్రభుత్వ,ప్రైమరీ పాఠశాలలు, చర్బౌలి,క్రిస్టియన్ కాలిని,సుందరయ్య నగర్ గ్రేయన్ మార్కెట్ తదితర పాఠశాలలో ఆయన మాట్లాడుతూ ఎస్జిటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు శాపంగా మారిన నూతన పెన్షన్ విధానం రద్దు చేసి ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలుగా ఉన్న ఐదు డీఏ లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, పూజారి మనోజ్ మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేసి, అందరికీ మినిమం టైం స్కేల్స్ ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాల లను స్వాధీనం చేసుకొని జీరో వన్ జీరో ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. 317 జీవో ద్వారా మ్యూచ్ వల్ బదిలీ చేసిన ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలన్నారు. 317 జీవోలో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు మరియు పెండింగ్ లో ఉన్న 13 జిల్లాల స్పౌజ్ కేటగిరి ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జె .స్వామి, ఉమ్మడి జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి యు. అశోక్, జిల్లా నాయకులు మనుపాటి వెంకట్, ఖిలా వరంగల్ మండల ప్రధాన కార్యదర్శి దోనం రమేష్ , ఉమేష్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.