సాగు రంగంలో వస్తున్న నూతన సాంకేతికతను, మార్కెట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతు చెంతకు చేర్చడమే ‘రైతునేస్తం’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన రైతువేదికలను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకే వేదికపై ప్రత్యక్షంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
2024 మార్చి 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన రైతునేస్తం కార్యక్రమం నేటితో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం రైతుల విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 24,85,581 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొనగా, వారిలో 5,26,107 మంది మహిళా రైతులు ఉన్నారని తెలిపారు. రెండేళ్ల కాలంలో 2,43,830 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మొత్తం 27.30 లక్షలకు పైగా రైతులు కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని వెల్లడించారు. రైతువేదికలను డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి రైతులతో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలను కలిపిన కార్యక్రమం దేశంలోనే ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే రైతునేస్తం ద్వారా రైతులు అడిగే ప్రశ్నలకు అదే సమయంలో శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు లభిస్తున్నాయని, దీనివల్ల పంటలకు నష్టం కలగకముందే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం రైతులకు లభిస్తోందని మంత్రి వివరించారు.
ప్రపంచంతో పోటీపడే వ్యవసాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అవసరమని మంత్రి అన్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతునేస్తం ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, జిల్లాల వారీగా అనువైన పంటలు, శాస్త్రీయ సాగు విధానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
లాభాదాయక సాగు కోసం నిపుణుల సూచనలు పాటించాలి
ప్రస్తుతం ఒకవైపు ఎల్-నినో ప్రభావం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం, రైతులు కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతును రాజుగా తీర్చిదిద్దడమే రైతునేస్తం కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో నీటి లభ్యత మరింత సవాలుగా మారే అవకాశాలు ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే పంటల కంటే ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను రైతులు పరిశీలించాలని సూచించారు. బోర్ల కింద, ప్రాజెక్టుల కింద ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి రైతే వెన్నెముక అని, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తేనే రైతు ఆదాయం పెరుగుతుందని అన్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం ప్రకారం గత వారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ, రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 10 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. అయితే ఈ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం లేదని చెప్పారు. కాబట్టి రైతులు ఈ వర్షాలను చూసి నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి వంటి పంటలను విస్తృతంగా సాగు చేయవద్దని సూచించారు.
భూగర్భ జలాల పరిస్థితిని జిల్లా, మండలాల వారీగా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సాధారణంగా జూలై నెలలో 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 150 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 27 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో వర్షాలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలువురు ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం ముగింపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు 5 గురు ఆదర్శరైతులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, వివిధ జిల్లాల ఆదర్శ రైతులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు మరియు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
