ముత్తిరెడ్డికి పాపం తగిలింది.. టికెట్ కూడా రాలేదు: రాజగోపాల్ రెడ్డి
‘తనను ఓడించడానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గ్రామానికి వచ్చిండు. వానికి పాపం తగిలింది. టికెట్ కూడా రాలేదు’ అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘తనను ఓడించడానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గ్రామానికి వచ్చిండు. వానికి పాపం తగిలింది. టికెట్ కూడా రాలేదు’ అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. తన దెబ్బకు మునుగోడు ప్రజల కాళ్ళు మొక్కి, కడుపులో తలకాయ పెట్టి కేసీఆర్ ఓట్లేపిచ్చుకున్నాడని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించాలంటే కూసుకుంట్ల ఒక్కడే సరిపోడు అని ప్రభుత్వమంతా మీ కాళ్ళ దగ్గరికి వచ్చిందన్నారు.
బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలోని నెమిళ్ళగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మహిళలు మంగళహారతులు, కోలాటాలతో స్వాగతం పలికారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవి అంటే ఒక బాధ్యత అని అన్నారు. కేవలం సైరన్ కారు హోదాగా భావించే బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు రాలేదని అసెంబ్లీలో ఎంత చెప్పినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసిన మీ నెమిళ్ళగూడెంలో ముస్లిం, క్రైస్తవులు కూడా నన్ను ఆదరించి ఇక్కడ మెజార్టీ తీసుకొచ్చినందుకు.. నా జీవితంలో నేవమిళ్లగూడెం ప్రజలను మర్చిపోలేనన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, నేవిల్ల గూడెం సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి, నాంపల్లి జడ్పీటీసీ ఏవి రెడ్డి, నాంపల్లి వైస్ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్, సీనియర్ నాయకుడు ఏడు దొడ్ల రఘుపతి రెడ్డి, సీనియర్ నాయకులు పూల వెంకటయ్య, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.