Telangana Municipal Elections : ‘మధ్యంతర పరీక్ష’గా మారిన మున్సిపోల్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు మధ్యంతర పరీక్షగా మారాయి. అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధానమైన మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రస్థాయిలో చాలెంజ్ గా భావిస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా ఈ పక్షాల్లోని అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ప్రధాన నేతలు తమ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుంటున్నారు. దీనివల్ల పోటీ తీవ్రమై గెలుపోటములపై నాయకులు సవాళ్ళు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ స్థానికంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 మున్సిపల్ కార్పొరేషన్ లు , 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా నామినేషన్లు, ఉపసంహరణ ముగిసింది. అభ్యర్ధులెవరో తేలిపోయింది. దీంతో మూడు పార్టీల ప్రచార పర్వం ఊపందుకున్నది. ఈ నెల 11వ తేదీన పోలింగ్, 13న కౌంటింగ్ జరుగనున్నందున ఈ సమయంలో వీలైనంత ఎక్కువమంది ఓటర్లను ప్రభావితం చేసేందుకు సర్వశక్తులొడ్డతున్నారు. రాజకీయ పార్టీల నేతలు, బరిలో నిలిచిన అభ్యర్దుల కంటే ఓటర్లు కూడా ఒకింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లతో పోల్చితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పట్టణ ప్రాంతాలు కావడంతో నేతల కంటే కూడా హుషారుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీ కేంద్రంగా ఎన్నికలు
తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఈ రాజకీయపోటీ పతాకస్థాయికి చేరింది. మూడు పార్టీలకు చెందిన వారిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన వారు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు ‘అసెంబ్లీ’ సెగ్మెంట్ కేంద్రంగా ఈ రాజకీయం హోరాహోరిగా సాగుతోంది. ఈ ఎన్నికలను గెలిచినవారు, ఓడిన వారు ఎవరికి వారు మధ్యంతర పరీక్షగా భావించడమే ప్రధాన కారణం. గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అందులో నియోజకవర్గ కేంద్రంలో తమ పట్టు సడలిందా? పెరిగిందా? అనే లెక్కలు వేసుకునేందుకు ఒక అవకాశంగా ఎంచుకున్నారు. ఇందులో విపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలతో పోల్చితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒకింత అగ్నిపరీక్షగా మారిందని చెప్పవచ్చు. అధికార పార్టీగా తమ పట్టు కోల్పోతే అధిష్టానం వద్ద పలుకుబడి సన్నగిల్లే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల అభ్యర్ధులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, ఇందులో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలు తమ బలమేమైనా పెరిగిందా? లేదా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ పై గెలిచిన ఎమ్మెల్యేపై వ్యతిరేకతతోపాటు తమ పార్టీ, తమ వ్యక్తిగత పట్టు ఎమైనా పెరిగిందా? లేదా? అనే బేరీజు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులే నియోజకవర్గ ఇంచార్జ్లుగా ఉన్నందున వ్యక్తిగతంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఎంపీలు తమ నియోజకవర్గలో ప్రస్తుత రాజకీయ పరిస్థితికి దీన్ని కొలమానంగా పరిగణిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు సాధారణ స్థాయిలో ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, బీజేపీకి చెందిన ఎంపీలు మాత్రం ఈ ఎన్నికలను సవాల్ గా భావిస్తున్నారు. తమ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపునకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల నియోజకవర్గ ఇంచార్జ్లు, ఎమ్మెల్యేలు తిరిగి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడంతోపాటు నియోజకవర్గంలో తాజా బలాబలాలేంటని తెలుసుకునేందుకు ఇదొక ఛాన్సుగా భావిస్తున్నారు. అందుకే ఎంతకైనా సిద్ధమవుతూ తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని యోచిస్తున్నారు.
పట్టు కోసం గట్టి ప్రయత్నాలు
ప్రధాన అంశమేమిటంటే ప్రస్తుతం ఎన్నికలు జరిగే మున్సిపాలిటిల్లో ఒకటి, అర ఉదాహరణకు తుంగతుర్తి, పాలకుర్తి లాంటివి నియోజకవర్గాలు మినహా మెజార్టీ నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు కావడం గమనార్హం. తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా తిరుమలగిరి, పాలకుర్తిలో తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు మూడు మున్సిపాలిటీలున్నాయి. ఉదాహరణకు డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ, మహబూబాద్ నియోజకవర్గంలో మహబూబాద్, కేసముద్రం, జనగామలో జనగామ, చేర్యాల ఉన్నాయి. ఈ మున్సిపల్, కార్పొరేషన్ పట్టణాలే రాజకీయ మలుపులు, మార్పులకు కీలక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రంలో పట్టు సాధిస్తే ఏ పార్టీకైనా అదనపు బలంగా భావిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పట్టుతప్పితే పుట్టిమునిగినట్లేనని భావిస్తారు. ఈ కారణంగా నిన్నమొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోల్చితే మున్సిపల్ ఎన్నికల్లో నువ్వానేనా అనేరీతిలో పోటీపడుతున్నారు. ఎన్నిపాట్లుపడైనా తమ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పొత్తులు, ఎత్తులు ప్రయోగిస్తున్నారు. విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. అభ్యర్ధులతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తమ వ్యక్తిగత పలుకుబడిని పనంగా పెడుతున్నారు. ఈ క్రమంలో డబ్బును లెక్కలోకి తీసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. మాసం, మద్యం, విందులతో పాటు చీరెలు, సారెలు రకరకాల బహుమతుల ద్వారా ఓటర్లకు ఎరవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో రాజకీయ పోటీ తీవ్రమై రాష్ట్రమంతా పొలిటికల్ హీటెక్కింది.
ఇవి కూడా చదవండి :
Nose Pin | మహిళలూ బీ కేర్‌ఫుల్.. ముక్కుపుడకతో ప్రాణాలకే ముప్పు..!
Reels | యువతి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. ఉరేసుకునే సీన్ రికార్డు చేస్తూ..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram