హైలైట్స్:
- రూ.24వేల కోట్ల పెట్టుబడి అంటూ కేటీఆర్ ప్రచారం
- వెలుగులోకి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ అక్రమాలు
- సత్యం కంప్యూటర్స్ మాదిరే తప్పుడు లెక్కలు
విధాత, హైదరాబాద్:
దేశంలో ఎన్ని నియంత్రణ సంస్థలు ఉన్నా చట్టాల్లో ఉన్న లొసుగులను, అవినీతి అధికారులను ఆసరా చేసుకుని కార్పొరేట్ కంపెనీలు మాయాజాలం చేస్తూ వేల కోట్లు కొట్టేస్తున్నాయి. బంగారం, ఆభరణాల వ్యాపారంలో దిగ్గజ సంస్థగా పేరొందిన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ పూర్తిగా తప్పుడు ఆదాయం, కాకి లెక్కలు చూపించిందని భారత్ మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఆరోపించడం సంచలనం రేపింది. ఈ సంస్థ 2021-25 మధ్యకాలంలో వచ్చిన ఆదాయాన్ని రూ.15 లక్షల కోట్లకు పైగా చూపించింది. ఈ ఆదాయంపై విచారణ జరిపిన సెబి అవాక్కయ్యింది. భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతాపై సెబి కఠిన చర్యలు తీసుకున్నది. అయితే ఈ అవినీతి కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకున్నది. 2002 సంవత్సరంలో అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సాక్షిగా ఉండగా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రాజేశ్ మెహతా ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
దేశీయ కార్పొరేట్ రంగంలో హర్షద్ మెహతా కుంభకోణం తరువాత సత్యం కంప్యూటర్స్.. ఇలా చెప్పుకుంటూ పలు కార్పొరేట్ కుంభకోణాలు జరిగాయి. తాజాగా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కుంభకోణం కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తున్నది. ఈ కంపెనీలో దేశీయ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ రూ.3వేల కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేసి నిండా మునిగింది. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన సత్యం కంప్యూటర్ కూడా తమ వ్యాపారానికి మించి, అమాంతంగా ఎక్కువగా చూపించి మదుపర్లు, సెబీని మోసం చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్, రాజేశ్ మెహతా హడావుడి…
దేశానికి అవసరం అయ్యే అధునాత ఆమోలెడ్ డిస్ ప్లేలను తయారు చేసేందుకు తెలంగాణలో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. 2022 జూన్ లో తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. కంపెనీ తరఫున చైర్మన్ రాజేశ్ మెహతా, తెలంగాణ ప్రభుత్వం తరఫున అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.24వేల కోట్ల వ్యయంతో ఆమోలెడ్ డిస్ ప్లే ఫ్యాబ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారి కేటీఆర్ ప్రకటించారు. ఈ సంస్థ ఫార్చ్యూన్ కంపెనీ–500 కంపెనీ అంటూ కితాబునిచ్చారు. 2022లో ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీ ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుతులు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. అయితే.. ఈ హడావుడితో అనేకమంది ఇన్వెస్టర్లు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని టార్గెట్ చేసుకుని రానున్న రోజుల్లో కేటీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధపడుతున్నాయి.
దేశంలో సెమికండక్టర్ లేదా ఆమోలెడ్ డిస్ ప్లే ఫ్యాబ్ కంపెనీ ఏర్పాటు చేయడానికి అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కొవిడ్ తరువాత సెమీ కండక్టర్ల విషయంలో తైవాన్, చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించింది. దేశంలో ఏర్పాటు చేసే కంపెనీలకు ఈ మిషన్ భారీగా సబ్సిడీలు మంజూరు చేసి ప్రోత్సహిస్తుంది. కాని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన ఎలెస్ట్ సంస్థకు డిస్‌ప్లే ఫ్యాబ్‌ల తయారీలో అనుభవం లేకపోవడం కేంద్రం అనుమతులు ఇవ్వలేదు.
తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం పెట్టుబడి రూ.24వేల కోట్లలో కంపెనీ ప్రమోటర్ రూ.12వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. రూ.12వేల కోట్లు వ్యయం చేసిన తరువాత ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ పెట్టుబడి వివరాలు పరిశీలించి, తనిఖీలు చేసిన తరువాత బిల్డింగ్, యంత్రాలు, మూలధన పెట్టుబడి పై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుంది. అయితే ప్రోత్సహాకాలు, రాయితీలు ఒకేసారి కాకుండా విడతల వారీగా మంజూరు చేస్తారు. ఇదే కాకుండా కంపెనీ ఏర్పాటు కోసం ఉచితంగా భూమి, తక్కువ రేటే విద్యుత్, పన్నుల్లో రాయితీ లభిస్తుంది. ఈ సంస్థ తెలంగాణకు రావడంపై అప్పటి మంత్రి కేటీఆర్ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఈ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ఆమోలెడ్ డిస్ ప్లే లను దేశంలోని కంపెనీలు వినియోగించుకుంటాయని, తెలంగాణ పేరు మారు మోగుతుందంటూ ప్రచారం చేశారు. ఇలాంటి కంపెనీ మన రాష్ట్రాంలో ఏర్పాటు చేయడం గొప్ప విజయంగా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తరువాత దాని ఏర్పాటుపై ఇటు కేటీఆర్ కాని అటు కంపెనీ ప్రమోటర్ గాని ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు సేకరించిన తరువాత కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా బీఆర్ఎస్ హయాంలో చేసిన ఘనమైన పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు.
ఇదీ నేపథ్యం
గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజేశ్ మెహతా కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు నగరానికి వచ్చి స్థిరపడింది. తొలుత రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసి, ఆ తరువాత అనుబంధంగా సింగపూర్‌లో ఆర్ఎల్ సింగపూర్ లిమిటెడ్ స్థాపించారు. సింగపూర్ కంపెనీకి అనుబంధంగా స్విట్జర్లాండ్‌లో గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ కంపెనీ ప్రారంభించాడు. గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ద్వారా స్విట్జర్లాండ్ దేశంలోనే వల్కాంబి రిఫైనరీని కొనుగోలు చేసి నిర్వహిస్తున్నాడు. ఇన్ని సంస్థల్లో కేవలం వల్కాంబి మాత్రమే లాభాలు ఆర్జిస్తున్నది. 2020–21 నుంచి 2024–25 మధ్యకాలం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ బంగారం శుద్ధి, ఎగుమతుల ద్వారా ప్రతి సంవత్సరం రూ.2.5 లక్షల కోట్ల చొప్పున మొత్తం రూ.15.15 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించినట్లు లెక్కలు సెబీకి సమర్పించింది. సెబీతో పాటు ఇతర రెగ్యులేటరీ సంస్థలు, షేర్ హోల్డర్లు, పెట్టుబడిదారులకు కూడా సమాచారం పంపించింది.
ఈ వివరాలు పరిశీలించిన ఒక సాధారణ ఇన్వెస్టర్ కంగుతిన్నాడు. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఎలా సమకూరిందంటూ పరిశీలన మొదలు పెట్టాడు. లెక్కల్లో ఏదో తేడా ఉందని, నిగ్గు తేల్చాలంటూ సాధారణ ఇన్వెస్టర్ 2024 మార్చి 11వ తేదీన సెబీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించాడు. ఫిర్యాదు పరిశీలించిన సెబీ ఉన్నతాధికారులు మరుసటి నెల అక్టోబర్లో ఒక దర్యాప్తు టీమ్ నియమించింది. బీడీవో ఇండియా అనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంస్థకు విచారణ బాధ్యత అప్పగించింది. దీనిని అడ్డుకునేందుకు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చేయని ప్రయత్నం లేదనే వాదనలు ఉన్నాయి. 98 శాతం ఆదాయం స్విట్జర్లాండ్ వల్కాంటి నుంచి వస్తుందని లెక్కల్లో చూపించి, ఆ వివరాలు ఇచ్చేందుకు ఆ దేశ చట్టాలు అంగీకరించవంటూ సహాయ నిరాకరణ చేసింది. రికార్డులు పరిశీలించిన విచారణ టీమ్, రూ.15.15 లక్షల కోట్ల ఆదాయం బోగస్ అంటూ సెబీకి నివేదిక సమర్పించింది. దీంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్, ప్రమోటర్ రాజేశ్ మెహతాపై సిబీ చర్యలకు ఉపక్రమించింది. కంపెనీ షేర్లలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది.
2019 నుంచి 2021 మధ్యకాలంలో ఎల్ఐసీ ఈ కంపెనీలో 3.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఒక్కో షేరు విలువ రూ.700 నుంచి రూ.1,000 మధ్య ఉంది. ఎల్ఐసీ వద్ద ఉన్న ఈ కంపెనీ షేర్ల విలువ రూ.3,280 కోట్లు కాగా కుంభకోణం వెలుగులోకి రావడంతో రూ.3వేల కోట్ల నష్టం వాటిల్లింది.