గ్రామాల్లో భూముల ధరలకు త్రిబుల్ ఆర్ ఊపు !

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ గ్రామాల్లో భూముల ధరలు పెరగనున్నాయి. భూసేకరణ పూర్తికావడంతో రైతులు, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామాల్లో భూముల ధరలు మళ్లీ ఊపందుకోనున్నాయి. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్‌ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తరభాగం 162 కి.మీ. నిడివి రోడ్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే, మొత్తం అలైన్‌మెంట్‌ నిడివిలో 80 శాతం భూమికి సంబంధించిన మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి భూసేకరణ, పరిహారం, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పనులు మొదలు పెట్టేందుకు మార్గం సుగమమైంది. త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు స్థానిక మార్కెట్ విలువ మేరకు 2013 భూసేకరణ చట్టం అనుసరించి ఎకరానికి రూ. 16 లక్షల నుంచి గరిష్టంగా రూ.1.27కోట్ల వరకు పరిహారం చెల్లించారు.

రెండు రకాలుగా పెరిగిపోనున్న భూముల ధరలు

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రోడ్డు వెంట, పరిసర గ్రామాలలో భూముల ధరలు పెరిగిపోనున్నాయి. ముఖ్యంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం సాగనున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధిలోని భూములకు విలువ పెరగడంతో పాటు, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. రైతులు తమ పొలాల పక్కన వెలుతున్న త్రిబుల్ ఆర్ తో తమ భూముల ధరలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. త్రిబుల్ ఆర్ వెంట గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బోర్డులు విరివిగా వెలుస్తున్నాయి. ఒకప్పుడు పంట పొలాలుగా ఉన్న భూములలోకి ఇప్పుడు కాంట్రాక్టర్లు, రియల్టర్లు మట్టిని తరలిస్తున్నారు. ఇదంతా త్రిబుల్ ఆర్ రాకతో వస్తున్న మార్పు అని..నిజంగా త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు గేమ్ చేంజర్ అవుతుందని అధికారులు అంటున్నారు.

పరిహారం డబ్బులతో కొత్త ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు

త్రిబుల్ ఆర్ తో భూములు కోల్పోయిన రైతులు తమకు పరిహారంగా వచ్చిన లక్షలాది రూపాయాలతో మరోచోట భూముల కొనుగోలుకు ప్రయత్నిస్తుండటంతో ఇతర ప్రాంతాల్లో భూముల ధరలకు సైతం ఊపు వస్తుంది. త్రిబుల్ ఆర్ తో భూములు కోల్పోయి పరిహారం అందుకున్న ఏనిమిది జిల్లాల పరిధిలోని నిర్వాసిత రైతులు కొత్త ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో త్రిబుల్ ఆర్ చుట్టు పక్కల గ్రామాల్లో భూముల ధరలలో ఒక్కసారిగా కదలిక మొదలైంది. ముఖ్యంగా భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ, చౌటుప్పల్‌, నారాయణపూర్‌, తుర్కపల్లి, మునుగోడు, చండూర్, మర్రిగూడ మండలాలతో పాటు జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాలకు చెందిన త్రిబుల్ ఆర్ నిర్వాసితులు కొత్త ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు ప్రయత్నిస్తుండటంతో గ్రామాల్లో భూముల ధరలు పైపైకి వెలుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ వంటి మండలాలో నీటి వసతి ఉన్న సాగు భూములకు, రోడ్లకు దగ్గరగా ఉన్న భూములకు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అరూర్ లో ఎకరం రూ. 1 కోటి 35లక్షల వరకు ధర పలుకడం విశేషం.

త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం పనులు రెండు ప్యాకేజీలుగా..

ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగం మొత్తం నిడివి161.518 కి.మీ.లు. తొలుత 8 వరసలతో నిర్మించాలని భావించినప్పటికీ, 6 వరసలకే ప్రస్తుతం కేంద్రం పరిమితం చేసింది. దీనిని రెండు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ప్యాకేజీ–1 కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వరకు (83.518 కి.మీ) నిర్మిస్తారు. ప్యాకేజీ–2 కింద ప్రజ్ఞాపూర్‌ నుంచి యాదాద్రి–భువనగిరి జిల్లా తంగేడ్‌పల్లి గ్రామం వరకు (78 కి.మీ.లు) వరకు నిర్మిస్తారు. ఉత్తర భాగంలో 1,950 హెక్టార్ల మేర భూమిని సేకరణకు సంబంధించి నిర్వాసితులకు రూ.5,500 కోట్ల మేరకు పరిహారం చెల్లింపు తుది దశకు చేరింది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి చౌటుప్పల్, భువనగిరి, జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి కంది వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

90 మీటర్ల వెడల్పే..

తొలుత 8 వరసల రోడ్డుగా ప్రతిపాదించడంతో ఎన్‌హెచ్‌ఏఐ 100 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంటును రూపొందించి, 1,933 హెక్టార్ల భూమి కావాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు భూమిని అప్పగించింది. తర్వాత రోడ్డును 6 వరసలకే కుదించటంతో, ఇప్పుడు 90 మీటర్ల వెడల్పు అలైన్‌మెంటు సరిపోతుందని కేంద్రం తేచ్చింది. మిగిలే 10 మీటర్ల అలైన్‌మెంటు భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ వినియోగానికి అప్పగించాలని నిర్ణయించింది.

హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌

ఉత్తర భాగం కోసం పీపీపీ, బీఓటీ నిర్మాణ పద్ధతులను పరిశీలించి చివరకు హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌ను ఎంపిక చేశారు. కేంద్రం 40% నిధులు నిర్మాణ సంస్థకు చెల్లించనుండగా, 60% నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకోనుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల కాలానికి ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే కావడం గమనార్హం.

భారీగా పెరిగిన బడ్జెట్‌

తొలుత రూ.15 వేల కోట్లతో 161.518 కి.మీ. నిడివితో ఉత్తర భాగాన్ని నిర్మించనున్నట్టు అంచనాలు రూపొందించినప్పటికీ, తాజాగా పీపీపీఏసీ ఏకంగా రూ.23,935.60 కోట్ల బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అంటే అంచనాలు దాదాపు రూ.9 వేల కోట్ల మేర పెరిగిపోయాయి. కాగా మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జాప్యం జరిగితే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన దక్షిణ భాగం నిర్మాణానికి రూ.35 వేల కోట్ల వ్యయమయ్యే అవకాశం కన్పిస్తోంది. దక్షిణ భాగం విషయంలో అలైన్‌మెంట్ కు ఇంకా ఆమోదం లభించలేదు .

Latest News