కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించి పినరయి విజయన్ పాలనకు ముగింపు పలుకుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Revanth Reddy

విధాత, హైదరాబాద్ : కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించి సీఎం పిన‌రయి విజ‌య‌న్ పాలనకు ముగింపు పలకనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన తరహాలోనే కేరళంలో పినరయి విజయన్ 120 నెల‌ల పాలన హయాం ముగిసిపోవడం ఖాయం అన్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో పిన‌రాయి విజ‌య‌న్ హ‌యాంలోని వైఫల్యాల‌ను ఎత్తి చూపానని, పిన‌రాయి విజ‌య‌న్ హ‌యాం ముగిసింది.. 120 నెల‌ల విజ‌య‌న్ పాల‌న కాలం వైఫ‌ల్యానికి ప్ర‌తీక‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు. పిన‌రాయి విజ‌య‌న్ వైదొలిగే స‌మ‌యం ఆస‌న్న‌మైందన్నారు. ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో మేం గెల‌వ‌బోతున్నాం.. ఊమెన్‌చాందీ త‌ర‌హా పాల‌న అందిస్తాం అని తెలిపారు.

పథకాల అమలుపై పినరయి విజయన్ కు రేవంత్ సవాల్

తెలంగాణ‌లో మాదిరే అభివృద్ధి.. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న, ఉద్యోగ నియామ‌కాలు… స్వీయ ఉపాధి అవ‌కాశాల‌ను మెరుగుప‌ర్చ‌డం వంటివి కేర‌ళంలో అమ‌లు చేస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. పిన‌రాయి విజ‌య‌న్‌తో పాటు కేర‌ళం క‌మ్యూనిస్టు మ‌హిళా నాయ‌కుల‌ను నేను తెలంగాణ‌కు ఆహ్వానిస్తున్నానని.. వారికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం అని, తెలంగాణ‌లోని ఏ మూల‌కైనా వెళ్లి మేం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వారు ప‌రిశీలించ‌వ‌చ్చు… ఈ విష‌యంలో నేను విజ‌య‌న్‌కు స‌వాల్ విసురుతున్నానన్నారు. ఎన్నిక‌లు కేర‌ళం.. తెలంగాణ మ‌ధ్య కాదు అని, యూడీఎఫ్‌.. ఎల్డీఎఫ్ మ‌ధ్య జ‌రుగుతున్నాయన్నది గుర్తుంచుకోవాలన్నారు. కేర‌ళంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ విజ‌యం సాధించింది.. దానిని మేం అభినందిస్తున్నాం అన్నారు. కేరళంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ ఘ‌న‌త కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు క‌రుణాక‌ర‌న్‌, ఊమెన్ చాందీల‌దేనని, ఎక్క‌డైనా మంచి జ‌రిగితే మేం అభినందిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

విజయన్ వైఫల్యాలతోనే కేరళం యువత వలసలు

కేర‌ళంలో స‌రైన అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో యువ‌త ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని, యువ‌త వ‌ల‌స వెళ్ల‌డంతో కేర‌ళంలో వృద్ధులు… చిన్నపిల్ల‌లే కనిపిస్తున్నారు… ఇది దుర‌దృష్ట‌క‌రం అని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యావంతులు… నైపుణ్యం ఉన్న యువ‌త విదేశాల‌కు వెళ్ల‌డం స‌రికాదు అని, వాళ్లు తిరిగి ఇక్క‌డ‌కు వ‌చ్చి ఉపాధి పొందేలా చేస్తాం అన్నారు. మేం 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం… 25 ల‌క్ష‌ల రైతు కుటుంబాలకు చెందిన‌ రూ. 20,670 కోట్ల రుణ‌మాఫీ చేశాం అని, 4 ల‌క్ష‌ల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాం అని గుర్తు చేశారు. మేం హామీలన్నీ అమ‌లు చేస్తున్నాం… విజ‌య‌న్ తెలంగాణ‌కు వ‌చ్చి అన్నీ ప‌రిశీలించుకోవ‌చ్చు అన్నారు. మేం ఏం చేస్తున్నామో అది చెబుతున్నాం.. మా స‌వాళ్ల‌కు విజ‌య‌న్ స‌మాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మోదీతో బంధంతోనే కేసుల నుంచి విజయన్ కు రక్షణ

విజ‌య‌న్ నాకు రాసిన లేఖ‌లో 2014-23 మ‌ధ్య విష‌యాల‌ను ప్ర‌స్తావించారు అని, ఆ కాలంలో పిన‌రాయి విజ‌య‌న్ స‌న్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయ‌న లేఖ‌లోని త‌ప్పుల‌న్నీ జ‌రిగినందునే తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్‌ను మార్చివేశారు.. ఇప్పుడు విజ‌య‌న్‌ను కేర‌ళం ప్ర‌జ‌లు మార్చివేస్తారు అన్నారు. విజ‌య‌న్‌పై శ‌బ‌రిమ‌ల బంగారం చోరీ, బంగారం స్మ‌గ్లింగ్ కేసులున్నాయి… విజ‌య‌న్ గాడ్‌ఫాద‌ర్ న‌రేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారన్నారు. మోదీనే ఈ కేసుల‌న్నింటి నుంచి విజ‌య‌న్‌ను ర‌క్షిస్తున్నారని ఆరోపించారు.
దేశం కోసం త‌మ జీవితాల‌ను, ఆస్తుల‌ను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని ర‌క‌ర‌కాల కేసుల‌తో వేధిస్తున్నారని, కేజ్రీవాల్ స‌హా అనేక మంది నేత‌ల‌ను ఈడీ కేసుల‌తో వేధించి అరెస్టు చేసిన వాళ్లు ఎందుకు విజ‌య‌న్ జోలికి రావ‌డం లేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. న‌రేంద్ర మోదీ… విజ‌య‌న్ మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌తోనే కేసులు, అరెస్టులు లేవు అన్నారు. మోదీ… విజ‌య‌న్ బంధాన్ని కేర‌ళం ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నారు.. స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారు.. కేర‌ళంలో మార్పు వ‌స్తుంది అని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

‘చిరాన్ ఫోర్ట్ క్లబ్’ భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి
సర్కారీ వారి నెంబర్ ఎప్పుడూ బిజీనే..జర్నలిస్టుల పరేషాన్ !

Latest News