2008 DSC | 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. వందల కుటుంబాలకు ఉపశమనం..!
2008 DSC | పదహారు ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఆందోళనలు, ధర్నాలు, విన్నపాల తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2008 డీఎస్సీ(బీఈడీ) అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

2008 DSC | హైదరాబాద్ : పదహారు ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఆందోళనలు, ధర్నాలు, విన్నపాల తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2008 డీఎస్సీ(బీఈడీ) అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో సీఎం రేవంత్‌కు బాధిత అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ నిర్ణయం మేరకు 2008 డీఎస్సీలో 30 శాతం రిజర్వేషన్ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ నుంచి సర్కార్ సేకరించింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పని చేసేందుకు 2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థులను విధుల్లోకి తీసుకోనున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం. అర్హత గల అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం సమాచారం చేరవేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పాఠశాల విద్య అధికారిక వెబ్‌సైట్‌లో కన్సెంట్, వెరిఫికేషన్ దరఖాస్తులను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆసక్తి గల అభ్యర్థులకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో డీఈవోల ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది.
2008 డీఎస్సీ నేపథ్యం ఇదే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 డిసెంబర్ 6వ తేదీన 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ జారీ అయింది. కాగా నోటిఫికేషన్ విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో -28ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన కోర్టు కామన్ మెరిట్ ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే నియామకాల ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. కౌన్సెలింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సమయంలోనే డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, 2010 జూన్ 28న కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించింది. జీవో 28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించాలని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త మెరిట్ జాబితాను విడుదల చేసి, నియామకాలు చేపట్టింది. ఈ నిర్ణయంతో మొదట మెరిట్ సాధించినప్పటికీ, 3500 మంది బీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో తెలంగాణ నుంచి 1200 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 1200 మందికి లబ్ది చేకూరనుంది.