ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలపై నాగర్ కర్నూల్ బీఆరెస్ అభ్యర్థి ఆరెస్ ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా
ఫిర్యాదుతో బయటపడిన మంత్రి అవగాహాన రాహిత్యం
విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలపై నాగర్ కర్నూల్ బీఆరెస్ అభ్యర్థి ఆరెస్ ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుందని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఫోను సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడవ వ్యక్తి లేదా సంస్థ విని రికార్డు చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటారని, మీ ఫిర్యాదు…మీ మాటలు చూస్తే మీకు ట్యాపింగ్ బేసిక్స్ మీద కనీస అవగాహన కూడా ఉన్నట్లు లేదని ఆరెస్పీ చురకలంటించారు. అసలు మీకు తెలియకుండా మీ ఫోను నుండి మంత్రి పొంగులేటికి కాల్ ఎట్ల పోతదని, నాకు తెలిసిన ఏ టాపింగ్ టెక్నాలజీ మీ ప్రమేయం లేకుండా మీ ఫోను నుండి రెండవ వ్యక్తికి కాల్ చేయదని(వాళ్లకు ఈ ప్రాంక్ కాల్స్ అవసరం కూడా ఉండదు), మీ అవుట్ గోయింగ్ కాల్ లిస్టు వెరిఫై చేసుకున్నారా? అని ప్రశ్నించారు. పొంగులేటి ఇన్కమింగ్ లిస్టులో ఉన్నది మీ నంబరేనా? మీ స్పీడ్ ఎమర్జన్సీ కాల్ లిస్టులో పొంగులేటి నంబరున్నదేమో చూసుకోవాలని, అసలు మీ ఫోను ఎప్పుడూ మీ దగ్గరే ఉంటదా? మీ ఫోను కు పాస్ కోడ్ ఉందా? ఆక్సిడెంటల్ గా ఫేస్ టైమ్ నొక్కారేమో మీరు? లేక రాత్రి అన్నారు కాబట్టి నిద్ర ‘మత్తులో’ పొంగులేటికి నొక్కారేమో? ఒక వేళ మత్తులో ఉంటే మీకు తెలిసే అవకాశమే లేదంటూ ఆరెస్పీ వ్యాఖ్యానించారు. మీకు తెలియని వ్యక్తి మీకు కాల్ చేయడమేంది? మీరు గట్టిగా అరవడమేంది? దీనికీ ట్యాపింగ్ కు సంబంధం ఏందని ప్రశ్నించారు. మీ కంప్లైంట్ చూసి డీజీపి కడుపుబ్బ నవ్వుకొని ఉంటాడని, ఆ కంప్లయింట్ మాతో కూడా షేర్ చేసుకోండి ప్లీజ్ అంటు ఎద్దేవా చేశారు. ఎందుకు సార్, సీనియర్ మంత్రైన మీరు పైనుండి వచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చదివి అభాసుపాలవుతారని ప్రశ్నించారు. ఈ ప్రపంచంలో ట్యాపింగుకు హ్యాకింగ్ కు అతీతమైన టెక్నాలజీ ఏదీ లేదని, స్మార్ట్ ఫోను కొని ఐ అగ్రీ అన్న బటన్స్ నొక్కిన రోజే మన ప్రైవసీ ఆవిరైపోయిందని, మీకు టైముంటే నెట్ ఫ్లిక్స్‌లో ఎడ్వర్డ్ స్నోడెన్ షో చూడండని సూచించారు. దయచేసి ఈ ట్యాపింగ్‌ల కామెడీని ఇక మీ అందరు బందు పెట్టి కేసీఆర్ లాగా రైతన్నల దగ్గరికి వెళ్లండని, వాళ్ల కన్నీళ్లను తుడవండని, పోయిన పరువు కొంచెమన్నా దక్కుతుందని హితవు పలికారు.