ఆర్మూర్ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ డిపో స్థలంలో జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మైక్‌లో చెప్పి మరి షాపింగ్ కాంప్లెక్స్ సీజ్
విధాత : ఆర్మూర్ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ డిపో స్థలంలో జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అర్టీసీ డిపో స్థలంలో లీజుకు సంబంధించి విశ్వజిత్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హైకోర్టు నెల రోజుల సమయం ఇచ్చినప్పటికి లీజు బకాయిలు చెల్లించలేదు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ ను మూసి వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. మైక్ పట్టుకొని షాపింగ్ కాంప్లెక్స్ అంతా తిరుగుతూ.. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గడువులోపు పెండింగ్ బకాయిలు చెల్లించనందుకు షాపింగ్ మాల్ ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కాగా ఎమ్మల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని విశ్వజిత్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరులో లీజుకు తీసుకొని పాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నారు. గత కొన్నేళ్లుగా లీజ్ సంబందించిన అద్దె కట్టకపోవడంతో ఆర్టీసీ డిపోకు బకాయి పడ్డారు. గతంలో ఆయన బీఆరెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని బకాయిలు, విద్యుత్తు బిల్లులకు సంబందించిన నోటీసులు వెళ్లాయి. దీనిని హైకోర్టులో సవాల్ చేసిన జీవన్ రెడ్డికి విచారణ అనంతరం బిల్లులు చెల్లించేందుకు హైకోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికి లీజు బకాయిల చెల్లింపులో స్పందించకపోడంతో ఈ సాయంత్రానికి షాపింగ్ మాల్ సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.