రేపు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ : సల్మాన్‌ ఖుర్షీద్

రేపు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ : సల్మాన్‌ ఖుర్షీద్

విధాత : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్‌ను రేపు ప్రకటించనుందని మాజీ కేంద్ర మంత్రి, ఏఐసీసీ నేత సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీలకు చేయబోయే కార్యక్రమాలను ఈ డిక్లరేషన్‌లో ప్రకటిస్తామన్నారు. తనకు హైద్రాబాద్ సొంతిల్లు వంటిదన్నారు. ఇందిరా, సోనియా గాంధీలతో తెలంగాణ ప్రజలకు మంచి సంబంధాలున్నాయని, ఇటీవలే సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహించామని, తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల హామీలు ప్రకటించారన్నారు.


కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో పదేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ కుటుంబం అవినీతితో కోట్లు దోచుకుందేగాని, ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదని తొమ్మిది నెలలోపునే ప్రగతిభవన్ కట్టుకున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను వెక్కిరించిన సీఎం కేసీఆర్ ఎంతమందికి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చారని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు ఇల్లు కట్టడానికి మా ప్రాధాన్యత ఉంటుందన్నారు. స్థలం లేకపోతే స్థలంం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. 5.72 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారని చెప్పిన కేసీఆర్ 65 లక్షల మందికి ఇల్లు లేకుండా చేశారన్నారు.


కట్టిన డబుల్ బెడ్ రూమ్‌లు నాసిరకంగా ఉన్నాయన్నారు. వర్షం వస్తే నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. ఆ ఇండ్లు పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కాదన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం చేసి నాణ్యత పాటించకుండా నిర్మించడంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. ఇళ్ల నిర్మాణానికి 23,679 కోట్లు కేటాయిస్తామన్నారు కాని 380 కోట్లు కేటాయించారన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు మల్లురవి, మైనార్టీ నాయకులు జఫార్ జావీద్‌, నసార్ హుసేన్, ఇమ్రాన్ ప్రతాప్ ఘడి, షకీల్ అహ్మద్, జమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.