సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మూసివేత.. దేవాదాయశాఖ తీరుపై ఆగ్రహం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు.
స్థలాన్ని కేటాయించాలని నిరసన
విధాత, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. మేడారం దేవస్థానానికి స్థల కేటాయింపుపై ప్రభుత్వం, దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ రెండు తేదీల్లో జాతర ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు.
1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్‌లోని పాత కేంద్ర కారాగారానికి ఎదురుగా 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇందులో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని, స్థలాన్ని భద్రకాళి దేవస్థానం అధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
పై స్థలం వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలం, భవనం అప్పగించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులకు వినతి పత్రాలిచ్చినా స్పందన లేకపోవడంతో గద్దెలు, ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నా నిర్వహించనున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, పూజారులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram