నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ

వంగపల్లి వద్ద మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో పడి మృతి చెందిన నవదంపతుల కేసులో షాకింగ్ వీడియో బయటపడింది. ప్రమాదానికి ముందు వారు రైలులో గొడవ పడిన దృశ్యాలు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి.

నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ

విధాత: వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి కోరాడ సింహాచలం (25), భవాని (19) అనే నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే వారి మరణానికి ముందు రైలులో దంపతులు ఇద్దరు గొడవ పడినట్లుగా ఓ వీడియో వెలుగులోకి రావడంతో ఈ సంఘటన మరో మలుపు తీసుకుంది. గొడవ నేపథ్యంలోనే రైలు ప్రమాదం జరిగిందా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతకుముందు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత డోర్‌ వద్ద నిలబడి ఉన్న ఇద్దరూ జారిపడి మృతిచెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్‌ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు తెలిపారు. ఇప్పుడు నవదంపతులు ఇద్దరు చనిపోవడానికి ముందు రైలులో గొడవ పడిన వీడియో వెలుగు చూడటంతో కేసు కొత్త మలుపు తీసుకుంది.

ఇవి కూడా చదవండి :

Harish Rao : రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు.. ఫ్లైయింగ్ సీఎం
Actress Aamani : బీజేపీలో చేరిన నటి ఆమని