వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం

సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ, అత్యవసర వైద్య సేవలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గర్భిణీలు, డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగులు, ఉబ్బసం, గుండె, మూత్రపిండాలు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇతర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో వాగులు, వంకలు దాటి ఆసుపత్రులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అటువంటి రోగుల వివరాలను ముందుగానే సేకరించి, అవసరమైతే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన మందులు, అత్యవసర పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యశాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

ప్రతీ ఏటా సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడే ములుగు జిల్లాలో వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఈ ఏడాది సమర్థంగా ఎదుర్కొనేందుకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క వైద్యశాఖను అప్రమత్తం చేశారు. ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. వైద్య సేవల్లో ములుగు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌ జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు నిర్వహించిన సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల విస్తరణ, వర్షాకాల ఆరోగ్య సన్నద్ధతపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, మందుల లభ్యత, అత్యవసర సేవలు, రోగులకు సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ములుగు జిల్లాను ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సమర్థవంతమైన పర్యవేక్షణ, క్షేత్రస్థాయి మానిటరింగ్‌తో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని, ఇదే స్ఫూర్తితో వైద్యరంగంలోనూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు. విద్యారంగంలో జిల్లాకు ఇప్పటికే విశిష్ట ఫలితాలు వచ్చాయని గుర్తు చేస్తూ, ఆరోగ్యరంగంలోనూ నాణ్యమైన సేవలు అందించి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని అన్నారు. ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, ప్రజాసేవలో నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, అభివృద్ధి పనులు, సిబ్బంది కేటాయింపు, నిర్మాణ పనులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, డీఎంహెచ్‌వో గోపాలరావు, వైద్యాధికారులు, మున్సిపాలిటీ కమిషనర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News