బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్‌కు మరో ఫిరాయింపుల షాక్ తగిలింది. ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, దండే విఠల్ భాను ప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గె మల్లేష్‌లు కాంగ్రెస్‌లో చేరారు

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

వరుస వలసల టెన్షన్‌లో బీఆరెస్‌
రేపోమాపో హస్తం గూటికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు..ఆరుగురు ఎమ్మెల్సీలు
గ్రేటర్ ఎమ్మెల్యేలపై ఫోకస్‌

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో ఢిలా పడిన బీఆరెస్ పార్టీకి వరుస ఫిరాయింపులు మరింత షాక్ నిస్తున్నాయి. ఒకేసారి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. బీఆరెస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య(వరంగల్‌), భాను ప్రసాద్‌(కరీంనగర్‌), బుగ్గారపు దయానంద్‌(హైదరాబాద్‌), ఎగ్గె మల్లేశం(హైదరాబాద్‌), ప్రభాకర్‌రావు(హైదరాబాద్‌), దండే విఠల్(ఆదిలాబాద్‌)లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే అర్ధరాత్రి వారంతా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరంతా కూడా ఇటీవల ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయినవారే కావడం విశేషం. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులకు గాను రెండు ఖాళీలు మినహాయిస్తే 38 మంది సభ్యులున్నారు.

వాస్తవంగా కాంగ్రెస్‌కు 4గురు ఎమ్మెల్సీలు ఉండగా ఇప్పటిదాకా 8మంది బీఆరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం 12 కు పెరిగింది. బీఆరెస్‌ బలం 22 కు పడిపోయింది. బీజేపీకి ఒకరు, ఎంఐఎంకు ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే బీఆరెస్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మునుముందు మరింత మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆయనతో పాటు మరో ముగ్గురు బీఆరెస్ ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలు రేపోమాపో కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా తెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై బీఆరెస్ అవిశ్వాసం పెట్టకముందే మండలిలో తగిన సంఖ్యాబలం సాధించే దిశగా బీఆరెస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీల ఫిరాయింపులను ప్రొత్సహిస్తుండటం గమనార్హం.

టెన్షన్‌లో బీఆరెస్ అధినాయకత్వం

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరుస ఫిరాయింపులతో బీఆరెస్ అధిష్టానం టెన్షల్‌లో పడిపోయింది. ఏ రోజు ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కారు దిగి పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిపోతారోనన్న అయోమయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆందోళనలో పడిపోయారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఇటీవల బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిపోగా, మిగతా వారినైనా పార్టీ వీడకుండా చేసేందుకు వారికి స్వయంగా ఫోన్లు చేస్తూ ఫామ్ హౌస్‌కు రావాలని కోరినట్లుగా బీఆరెస్ వర్గాల కథనం. త్వరలో జరుగనున్న అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాల నాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో తెలియని గందరగోళం బీఆరెస్ అధిష్టానాన్ని పీడిస్తుంది.

గ్రేటర్ ఎమ్మెల్యేలపైనే ఫోకస్‌

పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కేసీఆర్‌…కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డిలు పోటాపోటీగా సాగిస్తున్న ప్రయత్నాల క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి బీఆరెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపై పడింది. శనివారం జరిగే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పార్టీ ఫిరాయించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లతాశోభన్‌రెడ్డిలపై అవిశ్వాసం పెట్టాలని బీఆరెస్ నిర్ణయించుకుంది. ఇందుకోసం తెలంగాణ భవన్‌లో శుక్రవారం గ్రేటర్ పరిధిలోని కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏడుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిలు డుమ్మా కొట్టారు. వీరంతా కాంగ్రెస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని, వారిలో ఒక్కొక్కరు బీఆరెస్‌లో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం వినిపిస్తుంది.