Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత.. సాగర్ వైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టుకు నిండు కుండలా మారింది. ఈ జలాశయానికి క్రమక్రమంగా వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.

Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టుకు నిండు కుండలా మారింది. ఈ జలాశయానికి క్రమక్రమంగా వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీళ్లు పాల పొంగులా పొంగిపొర్లుతున్నాయి. ఈ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో చిత్రీకరిస్తూ పరవశించి పోతున్నారు.
స్పిల్ వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.