Jupalli Krishna Rao | పాండవులగుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి : రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

పాండవులగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మంత్రి సీతక్క తో కలిసి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు

Jupalli Krishna Rao | పాండవులగుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి : రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

విధాత, వరంగల్ ప్రతినిధి : పాండవులగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మంత్రి సీతక్క తో కలిసి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ముందుగా కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామం మీదుగా తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వరస్వామి గుట్ట, పాండవుల గుట్టకు చేరుకుని అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ రెండు గుట్టలను కలుపుకొని ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడం, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు, పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పాండవుల గుట్ట, బుగులోని గుట్టకు వివిధ గ్రామాల నుండి వచ్చే రహదారులను అభివృద్ధి చేయడం తదితర సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 12.15 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం గణపురం మండలం మైలారం గ్రామంలోని గుహలను పరిశీలించి, అక్కడి నుండి గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువును పరిశీలించి, చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం, అవసరమైన సదుపాయాలు కల్పన, తదితర అంశాలపై చర్చించారు.

గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ళు ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భూపాలపల్లి జిల్లా త్వరలో టూరిజం హబ్ మరబోతుందని అన్నారు. జిల్లాలోని వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు. అన్ని వనరులకు నిలయంగా ఉన్న భూపాలపల్లిని ఇండస్ట్రీయల్ హబ్ గా అభివృద్ధి జరుగబోతుందని పేర్కొన్నారు. కేంద్ర నుండి ప్రత్యేక నిధుల తీసుకువచ్చి భూపాలపల్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేటీకరణ జరగబోనవ్వమని స్పష్టం చేశారు. తర్వాత రామప్ప దేవాలయం పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కె ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ జీఎం తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..