Statue of Peace | స్టాచ్యూ ఆఫ్ పీస్.. ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం
హైదరాబాద్‌లోని బాపూ ఘాట్(Bapu Ghat)లో ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని (world's largest statue Mahatma Gandhi) ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రకటించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు(Gandhi Sarovar project)లో భాగంగా స్టాచ్యూ ఆఫ్ పీస్ (Statue of Peace) పేరిట దీన్ని నిర్మించనున్నారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 (విధాత):
Statue of Peace | ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్ బాపూఘాట్‌లో ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుందని తెలిపారు. శాంతి, ఐక్యతభావనకు ఇది చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ రెండు నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ.నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
- ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్నవి..
- గాంధీజీ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచేసేందుకు ఒక నాలెడ్జ్ హబ్
- ఆత్మపరిశీలన, ప్రశాంతత కోసం ఒక ధ్యాన గ్రామం
- ఖాదీ, చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించేందుకు హ్యాండ్లూమ్ ప్రమోషన్ కేంద్రం
- ప్రజలకు వినోదం అందించేందుకు రేక్రియేషన్ ప్రదేశాలు, ల్యాండ్ స్కేప్స్
- గాంధీజీ జీవితం, బోధనలను తెలియజేసేలా ప్రత్యేక మ్యూజియం