బీఆరెస్‌-కాంగ్రెస్‌ల మధ్య సుఫారీ మంటలు

రాష్ట్ర రాజకీయాల్లో బీఆరెస్‌-కాంగ్రెస్‌ పార్టీల మధ్య సుఫారీ మాటల మంటలు రేగుతున్నాయి. నారాయణపేట కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్‌-బీజేపీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు ఎన్నికలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ విమర్శించారు

బీఆరెస్‌-కాంగ్రెస్‌ల మధ్య సుఫారీ మంటలు

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్ధించిన అద్దంకి
ఖండించిన బీజేపీ నేత లక్ష్మణ్‌.. బీఆరెస్‌ నేత గాదరి

విధాత : రాష్ట్ర రాజకీయాల్లో బీఆరెస్‌-కాంగ్రెస్‌ పార్టీల మధ్య సుఫారీ మాటల మంటలు రేగుతున్నాయి. నారాయణపేట కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్‌-బీజేపీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు ఎన్నికలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ విమర్శించారు. జైల్లో ఉన్న బిడ్డ కవితను కాపాడుకునేందుకు కేసిఆర్ ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకొని సుఫారీ తీసుకున్నారని బీఆరెస్‌ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, భువనగిరి, జహీరాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలవకుండా బీఆరెస్‌ ఓట్లు బీజేపీకి వేయాలని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సుఫారీ రాజకీయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు సమర్ధిస్తుంటే బీజేపీ, బీఆరెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ రేవంత్‌ వ్యాఖ్యలలో నిజముందన్నారు. కేసీఆర్‌ తన ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు.. అవినీతి అక్రమాల వల్ల బీజేపీతో సుఫారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీతో అగ్రిమెంట్ మాదిరిగా చేసుకున్న పరిస్థితులు గ్రౌండ్‌ లెవల్‌లో కనిపిస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ సుఫారీ రాజకీయాలను సీరియస్‌గా ఎదుర్కోవాలన్నారు. సుఫారీ రాజకీయాలపై రేవంత్‌రెడ్డి తనకున్న సమాచారం మేరకే మాట్లాడి ఉండవచ్చన్నారు. బీఆరెస్ ఎక్కడ తగ్గుతున్నా.. పెరుగుతున్నా అది బీజేపీకి మేలు చేసేందుకే అన్నట్లుగా కనిపిస్తుందని, బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి భవిష్యత్తులో వారిపై చర్యలు తీసుకోకుండా ఉండటానికి.. కాంగ్రెస్‌భు పూర్తిగా నష్టం చేసే విధంగా బీఆరెస్‌ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ రకంగా బీఆరెస్‌ ప్రయత్నాలు చేస్తుందని, తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని, ఇలాంటి రాజకీయాల వల్ల బీఆరెస్‌ పార్టీ పతనమవుతుందని తెలిసి కూడా వాళ్ళు వెనక్కి తగ్గడం లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆరెస్‌లు వేరు కాదని, బీఆరెస్‌ డిఎన్ఏ మొత్తం ఎన్డీఏలోనే ఉందని, బీఆరెస్‌ చేస్తున్న అపవిత్ర రాజకీయాలు ప్రజలు వ్యతిరేకించాలని కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

వారే కుమ్మక్కై మాపై నిందలా : ఎంపీ లక్ష్మణ్‌
ప్రధాని మోదీకి వస్తున్న అదరణ చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు, రాజకీయంగా ఉనికి కోల్పోయిన బీఆరెస్‌ను రోజూ ఏదో ఒక రకంగా సీఎం రేవంత్‌రెడ్డి తెర మీదకు తెస్తున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. బీఆరెస్‌ నాయకులు అవినీతిపరులని అనేక సార్లు విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే బీఆరెస్‌ ఎంఎల్ఎలను ఎలా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. వారు కాంగ్రెస్‌లో చేరగానే అవినీతి మరకలు తొలగిపోతున్నాయా అని వారు కుమ్మక్కు రాజకీయాలు చేస్తు మాపై నిందలు ఎందుకని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆరెస్‌-బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేసి లబ్ధి పొందిన కాంగ్రెస్‌ ఇప్పుడు మళ్లీ సుఫారీ రాజకీయాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయనదే చీకటి ఒప్పందం : గాదరి కిషోర్‌
సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ తన మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నాడని, అందుకే కాంగ్రెస్ పార్టీలో బలహీన అభ్యర్థులను పెట్టాడని, పైగా బీఆరెస్‌ సుఫారీ రాజకీయాలు చేస్తుందంటూ మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ విమర్శించారు. కేసీఆర్, బీఆరెస్‌ పేరు లేకుండా రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు.