Telangana Assembly | 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ గురువారం మ‌ధ్యాహ్నం వివిధ శాఖ‌ల అధికారుల‌తో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

Telangana Assembly | 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రైతు భరోసా..రుణమాఫీ..ఆర్‌వోఆర్‌, జాబ్ క్యాలెండర్లపై చర్చకు అవకాశం

విధాత, హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ గురువారం మ‌ధ్యాహ్నం వివిధ శాఖ‌ల అధికారుల‌తో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, డీజీపీ జితేంద‌ర్‌తో పాటు ప్ర‌భుత్వ విప్‌లు రామ‌చంద్ర నాయ‌క్, ఆది శ్రీనివాస్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. సమావేశంలో 24వ తేదీ నుంంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.

అయితే ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. వారం రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని అంచనా. ఈ సమావేశాల్లో 25లేదా 26తేదీల్లో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 23 న కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందులో రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులను అనుసరించి.. పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో గ‌త కొద్ది రోజుల నుంచి వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు.

కీలక అంశాలపై చర్చలు

రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా, రుణమాఫీ పథకాలపైన కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే జాబ్ క్యాలెండర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. భూముల విలువ…రిజిస్ట్రేషన్ల ధరల పెంపు, ధరణి స్థానంలో కొత్త చట్టం, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే కాళేశ్వరం, విద్యుత్తు కమిషన్ల అంశాల ప్రస్తావన తప్పదంటున్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై చర్చ జరుగవచ్చంటున్నారు విశ్లేషకులు. ఈ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే 6 గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలతో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌…బిల్లులపైన ప్రతిపక్షాలు ప్రభుత్వంతో చర్చల రచ్చ సాగించే అవకాశం కనిపిస్తుంది.