Telangana Assembly | నేటి నుంచి సభాపర్వం! మూడు రోజులా? ఐదు రోజులా?
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

చర్చకు రానున్న కీలక అంశాలు
అందరి దృష్టి కాళేశ్వరం నివేదికపై
బీసీ రిజర్వేషన్‌పై ఏం చేస్తారు?
వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యేనా?
Telangana Assembly | హైదరాబాద్, ఆగస్ట్ 29 (విధాత): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి అసెంబ్లీ సంతాపం తెలియజేయనుంది. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. పీసీ ఘోష్ రిపోర్టును అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అవసరమో తమ వాదనను బీఆర్ఎస్ వినిపించే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరౌతారా? లేదా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికార, విపక్షాలు ఎత్తులకు పైఎత్తులతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగబోతున్నాయి.
అసెంబ్లీలో పీసీ ఘోష్ రిపోర్ట్
మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది జూలై 31న ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజకీయంగా తమను దెబ్బతీసేందుకే పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రిపోర్టును రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లినా బీఆర్ఎస్‌కు ఊరట లభించలేదు. దీంతో ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. బీఆరెస్ నాయకులు గొప్పగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం చేశారో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఎత్తులు వేస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీ సభ్యులకు అందించనున్నారు. ఈ రిపోర్టు కాపీని తమకు ఇవ్వాలని ఇప్పటికే హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కోరారు. అసెంబ్లీలో ఈ రిపోర్టును ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలను ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెటేషన్ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. దీనిపై స్పీకర్‌కు వినతిప్రతం సమర్పించారు. కాళేశ్వరంపై ప్రభుత్వ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దం అవుతోంది. రెండు రోజులుగా హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ గులాబీ దళపతి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ వ్యూహలకు కౌంటర్ వ్యూహాలను రచించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బదులు హరీశ్ రావు పార్టీ తరఫున అసెంబ్లీలో వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు జరుగుతున్నాయి. దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతిస్తే హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు కూడ కౌంటర్ ఇవ్వాలని గులాబీ పార్టీ భావిస్తున్నది.
స్థానిక అంశాలను ప్రస్తావించనున్న బీజేపీ
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, యూరియా కొరతతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు విషయమై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని బీజేపీ భావిస్తోంది. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో బీజేపీ శాసనసభపక్షం సమావేశమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీకి రాజీనామా చేయడంతో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఇండిపెండెంట్‌గా హాజరుకానున్నారని తెలిసింది. బీజేపీకి ఆయన చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించింది. అయితే అసెంబ్లీలో టెక్నికల్ గా ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే ఉంటారు.
బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారు?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ న్యాయ సలహా తీసుకుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బీ సుదర్శన్ రెడ్డితో పాటు, ఢిల్లీలో పలువురు న్యాయ నిపుణులతో కమిటీ చర్చించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం టికెట్లు కేటాయించడం, ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఆమోదం కోసం ఒత్తిడి తేవడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. ప్రత్యేక జీవో జారీ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరైనా కోర్టును ఆశ్రయించిన పక్షంలో రిజర్వేషన్లు ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. శనివారం నాడే తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశంఉంది. యూరియా, భారీ వర్షాలు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్దం అవుతున్నాయి.
మాగంటి గోపీనాథ్‌కు అసెంబ్లీ సంతాపం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ ఏడాది జూన్ 8న మరణించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గోపీనాథ్ మృతికి అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత బీఏసీ ఏర్పాటు చేసి.. ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం కేబినెట్ కూడా సమావేశం కానుంది.